PM Narendra Modi Telangana Tour 2023 :తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా దూసుకుపోతున్న కమలం పార్టీ ఎన్నికలకు సమాయత్తమవుతుంది. అక్టోబర్ 10 లోపు రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్(Telangana Election Schedule) వస్తుందనే ప్రచారం నేపథ్యంలో అప్రమత్తమైంది. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు ఒక విడత అగ్ర నేతలతో భారీ బహిరంగ సభలు నిర్వహించి నిస్తేజంలో ఉన్న పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయాలని యోచిస్తోంది.
అక్టోబర్ 1 తేదీన మహబూబ్ నగర్ జిల్లా భూత్పుర్ ఐటీఐ గ్రౌండ్స్ లో మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ భారీ బహిరంగ సభ(BJP Public Meeting)ను నిర్వహిస్తోంది. ఈ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పాలమూరు గడ్డ మీద నిర్వహిస్తున్న బహిరంగ సభ వేదిక నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, తెలంగాణకు కేంద్రం చేసిన సహాయం రాష్ట్ర ప్రజలకు వివరిస్తూనే.. కేసీఆర్ సర్కారు వైఫల్యాలు, తెలంగాణ ప్రజలకు చేసిన మోసాలపై ఎండగడుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
PM Modi Visit to Nizamabad on October 3 :పాలమూరు సభ అనంతరం అక్టోబర్ 3వ తేదీన నిజామాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పసుపు బోర్డు ఏర్పాటుపై పీఎం స్పష్టత ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌లో ప్రధానితో రోడ్ షో నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఒక వేళ రోడ్ షో సాధ్యపడకుంటే బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోంది. నల్లగొండలోనూ ప్రధాని మోదీతో సభ నిర్వహించాలని యోచిస్తోంది.
దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలో ఖరారు కానుంది. అక్టోబర్ తొలి వారంలో ఆదిలాబాద్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌కు రానున్నారు. షా పర్యటన తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ ముగ్గురు అగ్ర నేతలు హాజరయ్యే బహిరంగ సభలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పెద్ద ఎత్తున బహిరంగ సభలకు జనాన్ని తరలించేందుకు ప్లాన్ చేస్తోంది.
పలుమార్లు వాయిదా పడి.. ఈసారి..:ప్రధాని మోదీ చివరిసారిగా ఏప్రిల్ నెలలో తెలంగాణలో పర్యటించారు. ఆ తర్వాత పలుమార్లు మోదీ పర్యటన ఖరారైన.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా అక్టోబర్ 1న ప్రధాని మరోమారు రాష్ట్రానికి రానున్నట్లు పార్టీ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. గతంలో రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి వచ్చిన మోదీకి.. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ శాంతి కుమారి, ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.