మహబూబ్నగర్ జిల్లాలోని 462 మంది సర్పంచ్లు, 1,065 స్వచ్ఛ అవార్డు గ్రహీతలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 2 వరకు 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమం చేపట్టాలని వారికి పేరు పేరునా లేఖలు పంపారు. జాతిపిత మహాత్మా గాంధీ స్వప్నమైన బహిరంగ మల విసర్జన రహిత భారతదేశాన్ని సాధ్యం చేయడంలో కీలక పాత్ర వహించి సహకారాన్ని అందించినందుకు ప్రశంసించారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ విషయంలో కూడా ఇంతే స్ఫూర్తితో కృషి చేస్తారనే నమ్మకముందని తన లేఖలో పేర్కొన్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కల్పించండి
సమగ్ర స్వచ్ఛత కార్యక్రమంలో ప్రతి ఒక్కరికీ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాల పట్ల అవగాహన కల్పించాలని తన లేఖలో సూచించారు. తమ తమ గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి... వాటి సురక్షిత నిర్మూలనకు అక్టోబర్ 2న గ్రామస్థులతో ప్రమాణం చేయించాలని పేర్కొన్నారు. ఈ విధంగా దీపావళి నాటికి మన గ్రామాలను ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి విముక్తి చేయవచ్చని తెలిపారు. ఎలాగైతే ఓడీఎఫ్ ఇండియాను సాధించుకున్నామో... అలాగే ప్లాస్టిక్ రహిత భారత్ నిర్మాణానికి కట్టుబడదామని అన్నారు.
ఇదీ చూడండి : వంతెన లేక ఒక కిమీ దూరం పది కిలోమీటర్లైంది..