కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు టీకాల కోసం బారులు తీరిన జనం ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లి అభ్యర్థిస్తున్నా ముందుకు రావడం లేదు. ఇంటికి వెళ్తే ముఖం మీదే తలుపు వేస్తున్నారని ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 శాతం మొదటి డోస్ పూర్తిచేయాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరుపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
కరోనా తీవ్రత అధికంగా ఉన్న రోజుల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగింది. అందుబాటులో టీకా నిల్వలు లేక వచ్చిన జనాన్ని తిప్పి పంపిన రోజులున్నాయి. ప్రస్తుతం 100 శాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నా జనం ముందుకు రావడం లేదు. అనారోగ్యం బారిన పడటం, టీకా పట్ల భయం, అవగాహనలేమి, అనాసక్తి వంటి కారణాలతో మొదటి డోసు తీసుకోని వారి సంఖ్య 30 శాతానికి పైగా ఉంది. ఇళ్లలోకి వెళ్తే కొందరు టీకా తీసుకునేదే లేదని తెగేసి చెబుతున్నారు. కొంతమంది ఇళ్లకు వెళ్తే ముఖం మీదే తలుపులు మూసేస్తున్నారు. తమ పరిధిలో ఒకటికి పదిసార్లు సర్వేలు చేసి అవగాహన కల్పిస్తున్నా ఫలితం ఉండటం లేదని ఆశా కార్యకర్తలు వాపోతున్నారు. 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సర్వేలు నిర్వహించి తాము అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.