పాలమూరు పట్టణం.. ఒకప్పుడు ఈ పట్టణం పేరు చెబితే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది మంచినీటి సమస్యే. పదేళ్ల కిందట మూడు నాలుగు రోజులకోసారో.. వారం రోజులకోసారో ఇంటింటికీ మంచినీళ్లు అందేవి. వేసవిలో మంటి నీటి కష్టాలు మాటల్లో చెప్పలేనివి. అలాంటి పట్టణంలో ప్రస్తుతం ప్రతి ఇంటికీ నిత్యం తాగునీరు అందుతోంది. నల్లా కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికీ సుమారు 40 నిమిషాల పాటు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
ఒకటి రెండు ప్రాంతాలు మినహా
గడిచిన డిసెంబర్ వరకూ.. రోజు మాని రోజు తాగునీరు సరఫరా చేసేవాళ్లు. కొన్నివార్డుల్లో రెండు, మూడు రోజులకోసారి నీళ్లు అందేవి. ఆ పరిస్థితికి స్వస్తి పలికి నూతన సంవత్సర కానుక ప్రతి రోజూ తాగునీరు అందించాలని మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్. అమల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వారం పది రోజుల్లో పరిష్కరించి అన్ని వార్డుల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించారు. అప్పటికే నెల రోజుల నుంచి ట్రయల్ రన్ నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు ఒకటి రెండు ప్రాంతాలు మినహా.. జనవరి 1 నుంచి అన్ని చోట్ల నిత్యం తాగునీరు అందించడంలో సఫలమయ్యారు. నిత్యం తాగునీరు అందించడం పట్ల జనం సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రోజూ సరఫరా
మహబూబ్‌నగర్ పట్టణ జనాభా సుమారు 2 లక్షల 75 వేలు. 54 వేల 916 కుటుంబాలన్నాయి. తాగునీరు అందించటం కోసం 28 ట్యాంకులు, 375 కిలోమీటర్ల పాత పైప్లైన్లు, 398 కిలోమీటర్ల కొత్త పైప్లైన్లు అందుబాటులో ఉన్నాయి. పట్టణంలో ప్రస్తుతం పాతవి కొత్తవి కలుపుకుని 39 వేల 850 నల్లా కనెక్షన్లున్నాయి. పట్టణ నీటి అవసరాలు తీరాలంటే నిత్యం 40 ఎమ్ఎల్డీల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా 39 ఎమ్ఎల్డీ రోజూ సరఫరా చేస్తున్నారు. ఒక్కో ఇంటికీ రోజూ 135 లీటర్ల నీటిని అందించాల్సి ఉండగా.. 128 లీటర్ల నీటిని మున్సిపల్ అధికారులు అందిస్తున్నారు.
ప్రజల సంతృప్తి
ఇంటింటికీ నల్లా కనెక్షన్లున్నాయి. కొత్తగా కనెక్షన్లు తీసుకున్నవారికి ఇప్పటికే నీటి మీటర్లు సైతం బిగించారు. పాత వాటికి బిగించాల్సి ఉంది. ఎవరికైనా నల్లా కనెక్షన్ కావాలన్నా రూపాయి చెల్లించి తీసుకోవచ్చు. అలా ఒకప్పుడు మంచినీటి కోసం నానా కష్టాలు పడిన ప్రజలు.. నిత్యం నీళ్లు అందడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో 50 శాతానికి పైగా ప్రస్తుతం మిషన్ భగీరథ నీరే తాగుతున్నారు.
దిగువ ప్రాంతాలకు అందడం లేదు
పట్టణంలో 49 వార్డులుండగా 46 వార్డుల్లో నిత్యం తాగునీరు అందుతోంది. వీరన్నపేట ఎర్రమన్నుగుట్ట ట్యాంకు నుంచి 13, 14 వార్డులు, 30వ వార్డులోని కొంతభాగానికి నీరందాల్సి ఉంది. ఒకే ట్యాంకు నుంచి మూడు వార్డులకు నీరందించాల్సి రావడంతో అక్కడ నిత్యం మంచినీటి సరఫరా చేయలేకపోతున్నారు. వారం, పది రోజుల్లో ఈ సమస్యను సైతం అధిగమించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. నిత్యం నీరందడం బాగానే ఉన్నా... ఏ సమయంలో నీళ్లొస్తాయో తెలియక జనం ఇబ్బంది పడుతున్నారు. చాలాచోట్ల కుళాయిలకు ఆన్-ఆఫ్‌లు లేక నీరు వృథాగా పోతున్న దృశ్యాలు పట్టణంలో కనిపిస్తున్నాయి. ఇక నల్లా కనెక్షన్లకు నేరుగా మోటార్లు బిగించి నీరు పైకి లాగడంతో.. దిగువ ప్రాంతాల్లోని ఇళ్లకు కావాల్సిన నీరు అందడం లేదు. ఈ సమస్యలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అధికారులు మాత్రం విలువైన మంచినీటిని వృథా చేయొద్దని అదే సమయంలో ప్రైవేటు వాటర్ ప్లాంట్లలో కొనుగోలు చేసి తాగవద్దని, మిషన్ భగీరథ సురక్షితమని సూచిస్తున్నారు.
నీళ్ల కొనుగోలు లేకుండా
గతంలో వేసవిలో మంచినీటి సమస్యను అధిగమించేందుకు వివిధ వార్డుల్లో పవర్ బోర్లుండేవి. మిషన్ భగీరథ సరఫరా మొదలుకావడంతో గతంలో వాటిని పూర్తిగా ఆపేశారు. ఎల్లూరు పంప్‌హౌజ్‌లో మోటార్లు మరమ్మత్తులకు గురైనప్పుడు మిషన్ భగీరథ ద్వారా నీరందక వాటిని పునరుద్ధరించారు. మరో నెల రోజుల్లో అన్ని పవర్ బోర్లను నిలిపివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమవుతున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రైవేటు వాటర్ ప్లాంట్ల ద్వారా జనం నీళ్లు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరూ.. మిషన్ భగీరథ నీళ్లు తాగేలా జనంలో అవగాహన కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :జాతీయ రహదారిపై వాహనాల బారులు