ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ప్రస్తుతం పాలమూరు పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెరాస అధికారంలోకి వచ్చాక పాలమూరును అభివృద్ధి చేయాల్సిందిపోయి.... ఎడారిగా మార్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రాజెక్టులను ఆయన నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఈ ఏడేళ్లలో వాటిని పూర్తి చేసి ఉంటే వివాదాలకు ఆస్కారమే ఉండేది కాదన్నారు. అవి అక్రమమని, అనుమతులు లేవని పేర్కొంటూ ఏపీ సీఎం జగన్ కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి అసలు వీలుండేది కాదన్నారు. సీఎం కేసీఆర్ స్వార్థం, దోపిడీ, అవినీతే ఇందుకు కారణమని విమర్శించారు. పాలమూరు వెనుకబాటుతనానికి ఆయనే సీఎం కేసీఆర్. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం అమిస్తాపూర్‌లో మంగళవారం విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ సభలో మాట్లాడారు.
మంత్రి పదవుల కోసమే మిన్నకున్నారా?
‘‘2004లో కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అరడజను, కేంద్రంలో రెండు మంత్రి పదవులు తీసుకున్న కేసీఆర్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. అప్పుడు కృష్ణా జలాలను రాయలసీమకు తరలించుకుపోతే ఎందుకు ప్రశ్నించలేదు? వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రి పదవుల కోసమే మిన్నకున్నారా? సమైక్యవాదులతో ఆయన చీకటి ఒప్పందాలు నచ్చకనే 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస 16 చోట్ల పోటీ చేస్తే ఏడుగుర్నే ప్రజలు గెలిపించారు. 2009లో తెదేపాతో పొత్తు పెట్టుకుని 45 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తే పది మందే గెలిచారు. 35 సీట్లలో డిపాజిట్లు కోల్పోయారని, తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని శాసనసభలో నాడు వైఎస్ అడిగినప్పుడు మీ పౌరుషం ఎక్కడికి పోయింది?’’ అని కేసీఆర్‌ను రేవంత్ ప్రశ్నించారు.
తెరాస అధికారంలోకి వచ్చాక ఇసుక దందాలు
‘ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటే సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు తదితరులు గుర్తుకు వచ్చేవారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక దందాలు, భూ కబ్జాదారులు, కమీషన్ల కోసం పాకులాడే ఎంపీలు, ఎమ్మెల్యేలు పాలమూరు జిల్లా పరువును గంగలో కలిపారు. రూ. 4 వేల కోట్ల ఫీజు రీఇంబర్స్‌మెంటు ఇవ్వాలన్నా, 1.91 లక్షల ఉద్యోగాలు రావాలన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి’