తెలంగాణ

telangana

ETV Bharat / state

Palamuru-Rangareddy: పాలమూరు-రంగారెడ్డిలో సాగునీరే ప్రధాన లక్ష్యం.. - Palamuru ranga reddy updates

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (Palamuru Rangareddy Lift Irrigation Scheam) పనుల్లో అక్రమ మైనింగ్‌ జరగలేదని... పర్యావరణ ఉల్లంఘన మాత్రమే చోటు చేసుకుందని... నిపుణుల కమిటీ పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణం తాగునీటికే అన్న హామీని ఉల్లంఘించి సాగునీరే ప్రధాన లక్ష్యంగా పనులు చేపట్టారని తెలిపింది. ఇందుకోసం రిజర్వాయర్లు నిర్మించడంలో భాగంగా ప్రజలు నిర్వాసితులు కూడా అయ్యారని తెలిపింది.

Palamuru
ఎత్తిపోతల

By

Published : Nov 25, 2021, 5:10 AM IST

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru Rangareddy Lift Irrigation Scheam)లో సాగునీరే ప్రధాన లక్ష్యమని... తాగునీరన్నది ఓ చిన్న భాగమేనని నిపుణుల కమిటీ వివరించింది. ఈ మేరకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (NGT)కి నివేదించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన... ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని దాఖలైన పిటిషన్‌పై ఎన్జీటీకి నిపుణుల కమిటీ తుదినివేదిక సమర్పించింది. అయితే కమిటీలో సభ్యులుగా ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌, గనులు, భూగర్భశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లు నివేదికలోని అంశాలపై విభేదించారు. సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి పరిహారం చెల్లించడంతోపాటు నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నందున పర్యావరణ ఉల్లంఘన కాదని పేర్కొన్నారు.

16.03 టీఎంసీల సామర్థ్యం...

పాలమూరు-రంగారెడ్డి(Palamuru Rangareddy Lift Irrigation Scheam)లో ఉద్దండాపూర్‌ ఐదో రిజర్వాయర్‌ 16.03 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం చేపట్టారు. డ్యాం నిర్మాణానికి అవసరమైన మట్టిని సమీపంలోని నీటి వనరుల నుంచి తీసుకోవడానికి అనుమతి పొందారు. వాటిని నీటిపారుదల శాఖ నిర్వహిస్తోంది. 10 చెరువుల నుంచి 3,43,920 క్యూబిక్‌ మీటర్ల నల్లరేగడి మట్టి తీసుకున్నట్లు సంబంధిత చీఫ్‌ ఇంజినీర్‌ నివేదించారు. ఇది అక్రమ మైనింగ్‌ కాదని... అయితే పర్యావరణ అనుమతిలేకుండా రిజర్వాయర్‌ ప్రాంతంలో మట్టి తీసుకోవడం ఉల్లంఘనేనని కమిటీ అభిప్రాయపడింది.

రెండోసారి అవసరం లేదు...

పాలమూరు-రంగారెడ్డి మొత్తం ప్రాజెక్టు(Palamuru Rangareddy Lift Irrigation Scheam)పై ఇచ్చిన నివేదికలో పరిహారం చెల్లించాలని కమిటీ సూచించినందున... ఉద్దండాపూర్‌కు సంబంధించినంతవరకు రెండోసారి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని కమిటీ నివేదికలో పేర్కొంది ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో పర్యావరణ అనుమతులు లేకుండా చెరువుల్లో మట్టితవ్వకాలు చేపడుతున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం ఎన్జీటీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర పర్యావరణశాఖపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉల్లంఘనలు జరుగుతున్నా ఎందుకు చర్య చేపట్టలేదని ప్రశ్నించింది. స్వతంత్ర నివేదికను సమర్పించాలంటూ విచారణను డిసెంబరు 13కు వాయిదావేసింది.

గౌరవెల్లి రిజర్వాయర్‌ పనుల్లో...

అనుమతుల్లేకుండా చేపట్టిన గౌరవెల్లి రిజర్వాయర్‌ పనుల్లో జరిగిన పర్యావరణ ఉల్లంఘనలకు 2 కోట్ల 5 లక్షలు పరిహారంగా చెల్లించాలంటూ సంయుక్త కమిటీ... జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు నివేదిక సమర్పించింది. పర్యావరణ అనుమతులకు పొడిగింపు ఉత్తర్వులు కోరకుండానే.. వరద కాల్వలు, గౌరవెల్లి రిజర్వాయర్ల విస్తరణ పనులు 85శాతం పూర్తయ్యాయని... ఇది పర్యావరణ చట్టాల ఉల్లంఘనేనని కమిటీ తేల్చి చెప్పింది. ఆ పనులపై బద్దం రాజిరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ఎన్జీటీ... సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈమేరకు కమిటీ సమర్పించిన నివేదికలో పలు సిఫార్సులు చేసింది. పునరావాసకల్పన పర్యవేక్షణకు కమిటీని, పర్యావరణ పునరుద్ధరణకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి బడ్జెట్‌ కేటాయించాలని సూచించింది. ఇప్పటికే ఏర్పాటు చేసిన స్టోన్‌క్రషర్లకు కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు పొందాలని సూచించింది.

ఇవీచూడండి:

ABOUT THE AUTHOR

...view details