తెలంగాణ

telangana

ETV Bharat / state

Palamuru-Rangareddy Lift Irrigation Project Status : పరుగులు పెడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు - పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకం డీటేల్స్

Palamuru-Rangareddy Lift Irrigation Project Status : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎత్తిపోతల పథకం పాలమూరు-రంగారెడ్డి. ఈ పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని లక్షల ఎకరాలకు సాగు నీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి బీఆర్​ఎస్​ సర్కార్​ ఈ పథకానికి రూపకల్పన చేసింది. కానీ పర్యావరణ అనుమతులు లేని కారణంగా ప్రస్తుతం తాగునీటి పనులకు మాత్రమే ప్రాజెక్టు పరిమితమైంది. మరి, ఆ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయా? లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం ముందున్నఅడ్డంకులేంటి? క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రత్యేక కథనం.

Palamuru Ranga Reddy Lift Irrigation Project latest news
Palamuru-Rangareddy Lift Irrigation Project Status

By

Published : Aug 8, 2023, 4:48 PM IST

Palamuru-Rangareddy Lift Irrigation Project Status : పరుగులు పెడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు

Palamuru-Rangareddy Lift Irrigation Project Status : కాళేశ్వరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. ఈ పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని 12లక్షల 30వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 1200గ్రామాలు సహా హైదరాబాద్‌ వరకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకూ నీళ్లు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది.

శ్రీశైలం ప్రాజెక్టు వెనక నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు రూ.32,500 కోట్లలతో ప్రారంభమైన ప్రాజెక్టు వ్యయాన్ని ప్రభుత్వం ఆ తర్వాత రూ.52వేల కోట్లలకు సవరించింది. ప్రాజెక్ట్‌లో 52శాతం పనుల్ని ఇప్పటికే పూర్తి చేశారు. అయితే పాలమూరు రంగారెడ్డి(Palamuru Rangareddy Lift Irrigation Project)కు అనుమతులు, పర్యావరణ ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని పరిశీలించిన ఎన్జీటీ పనులు ఆపి వేయాలని తీర్పు ఇచ్చింది.

Palamuru Rangareddy Lift Irrigation Project Latest News : ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎన్జీటీ తీర్పును నిలిపివేసిన సుప్రీంకోర్టు(Supreme Court).. తాగునీటి అవసరాల కోసం 7.15 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేందుకు అవసరమైన పనుల్ని కొనసాగించుకోవచ్చని ఫిబ్రవరిలో తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలకు లోబడి ప్రస్తుతం నార్లాపూర్ జలాశయం నుంచి ఉదండాపూర్ వరకు తాగునీటి అవసరాల కోసం నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన పంప్‌హౌస్‌లు, బహిరంగ కాలువలు, సొరంగ మార్గాలు విద్యుత్ సబ్ స్టేషన్లు, కంట్రోల్ యూనిట్లు ఇతర పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే నార్లాపూర్ పంపుహౌస్‌లోని మోటార్లకు విద్యుత్ అందించే పనులు పూర్తయ్యాయి. ఆగస్టు నెలలో కనీసం ఒక్క పంపుతోనైనా కరివెన జలాశయం వరకు తాగునీరు తరలించాలని నీటిపారుదలశాఖ అధికారులు శ్రమిస్తున్నారు.

దాదాపు పూర్తైన నార్లాపూర్​ పంపుహౌజ్​ పనులు : ఉదండాపూర్ జలాశయం వరకు నీళ్లు ఎత్తిపోయాలంటే ముందుగా శ్రీశైలం వెనుక జలాల నుంచి నార్లాపూర్ పంపుహౌజ్‌కు వెళ్లే అప్రోచ్ కెనాల్ పూర్తి కావాలి. ఆ పనులు దాదాపు పూర్తయ్యాయి. అక్కడి నుంచి బహిరంగ కాలువ, ఆ తరవాత 2సొరంగ మార్గాల ద్వారా నార్లాపూర్ పంప్ హౌస్‌కు కృష్ణా జలాలు(Krishna Water) చేరుతాయి. నార్లపూర్‌లో 9పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 2 సిద్ధమవుతున్నాయి.

డిండి నుంచి ఏదుల, అక్కడి నుంచి నార్లాపూర్‌ పంపింగ్‌ స్టేషన్‌కు విద్యుత్‌ టవర్ల నిర్మాణం పూర్తైంది. నార్లాపూర్‌ పంపింగ్‌ వద్ద 400కేవీ విద్యుత్‌ ఉపకేంద్రం నిర్మిస్తున్నారు. ఏదుల జలాశయం నుంచి నార్లాపూర్‌ వరకు 94 టవర్ల నిర్మాణం, కంట్రోలింగ్‌ సిస్టమ్‌ విద్యుత్తు ఛార్జింగ్‌ పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర ఎత్తిపోతల ప్రాజెక్టుల సలహాదారు పెంటారెడ్డి ఈ పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు నెలాఖరులోపు డ్రై రన్, ఆ తర్వాత వెట్ రన్ కూడా నిర్వహించాలన్న సంకల్పంతో ఇంజినీరింగ్ అధికారులు పనులు వేగవంతం చేశారు.

నార్లాపూర్ జలాశయం నుంచి 20 కిలోమీటర్ల మేర ఓపెన్‌ ఛానల్‌ ద్వారా, రెండు సొరంగ మార్గాల ద్వారా కృష్ణా జలాలు ఏదులలోని పంపుహౌస్‌కు చేరుతాయి. బహిరంగ కాలువ నిర్మాణం దాదాపుగా పూర్తి కాగా ఒక సొరంగమార్గం సిద్ధమైంది. మరో సొరంగ మార్గానికి లైనింగ్ పూర్తి కావాల్సి ఉంది. ఏదుల సర్జ్ పూల్, పంపుహౌస్ నిర్మాణాలు 95శాతం వరకూ పూర్తయ్యాయి.

Palamuru Ranga Reddy Lift Irrigation Project Details :ఏదుల జలాశయం నుంచి కృష్ణాజలాలు బహిరంగ కాలువ, సొరంగమార్గాల ద్వారా 24కిలోమీటర్ల మేర ప్రయాణించి వట్టెం పంపుహౌస్‌కు చేరుతాయి. బహిరంగ కాలువ, సొరంగ మార్గాల్లో తవ్వకపు పనులు పూర్తికాగా కేవలం లైనింగ్ వర్క్‌ పెండింగ్‌లో ఉంది. వట్టెం పంపుహౌజ్‌కు సంబంధించి సర్జ్ పూల్ పనులు 90శాతం వరకు పూర్తయ్యాయి. జలాశయం పనుల్లో కొన్నిచోట్ల కట్ట నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. వట్టెం జలాశయ సామర్థ్యం 16టీఎంసీలు కాగా 30శాతం నింపడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెబుతున్నారు.

కరివేన జలాశయం నీటినిలువ సామర్థ్యం 19టీఎంసీలు కాగా.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అత్యధిక నీటినిల్వ సామర్థ్యమున్న జలాశయంగా గుర్తింపు పొందింది. తాగునీటి అవసరాల కోసం కరివెన జలాశయం వరకు ఆగస్టు చివరి నాటికి నీళ్లు ఎత్తిపోయాలని తెలంగాణ సర్కారు భావిస్తుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details