మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. వైద్య కళాశాల సొంత భవనం, జనరల్ ఆసుపత్రి నిర్మాణం కోసం రూ. 450 కోట్ల అంచనా వ్యయంతో జిల్లా కేంద్రం శివారులోని ఎదిరలో 50 ఎకరాల్లో పనులు ప్రారంభించారు. ప్రస్తుతానికి రూ. 130 కోట్లతో వైద్యకళాశాల భవనం, వసతి గృహాలు, ప్రయోగశాలలు, ఆడిటోరియం వంటి నిర్మాణాలు ఐదు బ్లాకుల్లో మూడంతస్తుల్లో నిర్మించారు. విద్యార్థినీ, విద్యార్థులకు ప్రత్యేకంగా వ్యాయామశాలు, ఆట మైదానం ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచే వైద్య కళాశాల తరగుతులు ఈ భవనాల్లోనే సాగుతున్న అధికారికంగా ఇవాళ మంత్రులు వీటిని ప్రారంభించనున్నారు.
2014లో..
2014 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్నగర్ వైద్య కళాశాలను మంజూరు చేసింది. మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి జనరల్ ఆసుపత్రిగా మారింది. 2016 ఆగస్టు నుంచి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతితో తరగతులు మొదలయ్యాయి. 150మంది విద్యార్థులతో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం మొదలైంది. ఇప్పటి వరకూ 150 మంది విద్యార్థులతో 2016 నుంచి 2019 వరకు 625 మంది వైద్య విద్య నభ్యసించారు. 2019- 20 విద్యాసంవత్సరంలో ఈడబ్యూసీ కోటా కింద మరో 175 సీట్లకు అనుమతి లభించింది.