తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్షరాస్యతలో అట్టడుగు స్థానంలో ఉమ్మడి పాలమూరు జిల్లా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంక సంకలనం... ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది. వలసల జిల్లాగా పేరు మోసిన పాలమూరు దుస్థితిని మరోసారి కళ్లకు గట్టింది. పాలకులు తక్షణం దృష్టిసారించాల్సిన కీలక అంశాలను చెప్పకనే చెప్పింది. రాష్ట్రంలోనే అక్షరాస్యతలో ఉమ్మడి జిల్లాకు చెందిన నాలుగు జిల్లాలు అట్టడుగు స్థానంలో నిలవడం.. పరిస్థితికి అద్దం పడుతోంది. ఎస్సీ, ఎస్టీల్లో, మహిళల్లో నిరక్షరాస్యత రాజ్యమేలుతోంది. జనాభాలో 40 నుంచి 50 శాతం వరకూ ఎలాంటి ఆదాయ మార్గం లేక అల్లాడుతున్నారు. పడిపోతున్న లింగ నిష్పత్తులు తక్షణ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాయి.

Palampur district lags far behind in literacy
అక్షరాస్యతలో అట్టడుగు స్థానంలో ఉమ్మడి పాలమూరు జిల్లా

By

Published : Oct 29, 2020, 5:05 AM IST

భారత పౌరులు రాజ్యాంగం ద్వారా హక్కుగా పొందాల్సిన వాటిల్లో అత్యంత కీలకమైన అంశం చదువు. అలాంటి చదువులో, అక్షరాస్యతలో పాలమూరు జిల్లా దారుణంగా వెనుకబడింది. రాష్ట్రంలోనే అక్షరాస్యత తక్కువగా ఉన్న జిల్లాల్లో తొలి 4 జిల్లాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనివే. ఒక్క మహబూబ్​నగర్ జిల్లాలో తప్ప మిగిలిన అన్నిజిల్లాల్లో చదువుకున్నవాళ్లు 60శాతం కన్నా తక్కువగా ఉండటం.. ఉమ్మడి జిల్లాలో నిరక్షరాస్యతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలోనే అన్ని జిల్లాల కంటే వెనుకపడటం పాలమూరు దుస్థితిని బయటపెడుతోంది. పురుషుల్లో అక్షరాస్యత శాతం అన్ని జిల్లాల్లో 60శాతానికంటే ఎక్కువగా ఉన్నా.. రాష్ట్రంలో పురుషుల అక్షరాస్యతతో పోల్చితే ఐదు జిల్లాలూ వెనకబడి ఉండటం గమనించాల్సిన అంశం. ఇక మహిళల్లో అక్షరాస్యత గణాంకాలు జిల్లాలో బాలికలు, మహిళల విద్య పట్ల కొనసాగుతున్న వివక్షకు, నిర్లక్ష్యానికి అద్ధం పడుతున్నాయి. ఒక్క మహబూబ్​నగర్ జిల్లాలో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో మహిళల్లో చదువుకున్న వాళ్ల శాతం 50కి మించలేదు. మహబూబ్​నగర్ జిల్లాలోనూ అది 51శాతంగా మాత్రమే ఉంది. పురుషుల అక్షరాస్యతతో పోల్చితే దాదాపు 20శాతం తక్కువ.

ఉమ్మడి జిల్లాల్లో ఆరేళ్లు దాటిన వాళ్లలో అక్షరాస్యత శాతం

జిల్లా పేరు జనాభా చదువుకున్న వాళ్లు అక్షరాస్యత శాతం
జోగులాంబ గద్వాల 5,26,262 2,62,455 49.9
నారాయణపేట 4,89,240 2,44,256 49.9
నాగర్​కర్నూల్​ 7,54,307 4,10,159 54.4
వనపర్తి 5,05,381 2,81,331 55.7
మహబూబ్​నగర్​ 8,01,155 4,88,452 61.0

ఉమ్మడి జిల్లాల్లో ఆరేళ్లు దాటిన పురుషుల్లో అక్షరాస్యత శాతం

జిల్లా పేరు జనాభా చదువుకున్న వాళ్లు అక్షరాస్యత శాతం
జోగులాంబ గద్వాల 2,65,970 1,59,704 60.1
నారాయణపేట 2,42,393 1,46,208 60.3
నాగర్​కర్నూల్ 3,81,694 2,47,538 64.9
వనపర్తి 2,56,793 1,68,792 65.7
మహబూబ్​నగర్ 4,01,446 2,83,706 70.7

ఉమ్మడి జిల్లాల్లో ఆరేళ్లు దాటిన మహిళల్లో అక్షరాస్యత శాతం

జిల్లా పేరు జనాభా చదువుకున్న వాళ్లు అక్షరాస్యత శాతం
జోగులాంబ గద్వాల 2,60,292 1,02,751 39.5
నారాయణపేట 2,46,847 98,048 39.7
నాగర్​కర్నూల్ 3,72,613 1,62,621 43.6
వనపర్తి 2,48,588 1,12,539 45.3
మహబూబ్​నగర్ 3,99,709 2,04,746 51.2

చదువుల్లో వెనుకబడిన ఎస్సీలు

ఎస్సీల్లోనూ చదువుకున్న వాళ్లు 50శాతానికి మించలేదు. ఈ విషయంలోనూ ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో ఉంది. షెడ్యూల్ కులాల మహిళల్లో చదువుకున్న వాళ్ల సంఖ్య 37శాతానికే పరిమితమైంది. షెడ్యూల్ తెగల గణాంకాలు దాదాపుగా అంతే. షెడ్యూల్ తెగల మహిళల్లో చదువుకున్న వాళ్ల శాతం కేవలం 30శాతానికి మాత్రమే పరిమితం కావడం గమనించాల్సిన అంశం.

నిర్బంధ విద్య అమలు కావట్లే..

చదువుకోలేని వయోజనుల పరిస్థితి పక్కన పెటితే విద్యా హక్కు చట్టం ద్వారా 14ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. తెలంగాణ గణాంక సంకలనం వెల్లడించిన లెక్కల్లో బడి బయటి పిల్లల శాతాల్ని గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఐదు జిల్లాల్లోనూ ప్రాథమిక విద్యలో బడి మానేసే పిల్లల శాతం..20 నుంచి 36శాతం వరకూ ఉంటే ఎలిమెంటరీ విద్యకు వచ్చే సరికి అది 35 నుంచి 52శాతానికి పెరిగింది. ఇక సెకండరీ విద్యలో బడి మానేసే పిల్లల సంఖ్య 40 నుంచి 60శాతం వరకూ ఉందంటే.. బడి ఈడు పిల్లల్లో ఎంతమంది పాఠశాలకు వెళ్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

బడి బయటి పిల్లల శాతం

జిల్లా పేరు ప్రాథమిక ఎలిమెంటరీ సెకండరీ
మహబూబ్​నగర్ 29.44 34.86 42.26
జోగులాంబ గద్వాల 21.93 34.86 43.82
వనపర్తి 34.97 43.78 48.46
నారాయణపేట 31.45 45.22 54.48
నాగర్​కర్నూల్ 36.51 51.97 56.08

నిరుద్యోగం కూడా అదేస్థాయిలో..

చదువులేక, చేసేందుకు పని లేక నిరుద్యోగుల సంఖ్య కూడా అదేస్థాయిలో ఉంది. మొత్తం జనాభాలో ఎలాంటి ఆదాయం లేకుండా పనుల్లో లేని నిరుద్యోగుల సంఖ్య ఐదు జిల్లాలో 45 శాతం నుంచి 52శాతం వరకూ ఉన్నారు. ఏదో ఆదాయ మార్గమున్న వాళ్లలోనూ 38 నుంచి 55శాతం వ్యవసాయ కూలీగా పొట్ట నింపుకుంటున్న వాళ్లే. ఆదాయమున్న వాళ్లలో 20 నుంచి 33శాతం మందికి వ్యవసాయమే తిండిపెడుతోంది.

జిల్లా పేరు జనాభా నిరుద్యోగులు శాతం
జోగులాంబ గద్వాల 6,09,990 2,81,904 46.2
నాగర్ కర్నూల్ 8,61,766 4,05,004 47.0
నారాయణపేట 5,66,874 2,69,206 47.5
వనపర్తి 5,77,758 2,81,609 48.7
మహబూబ్​నగర్ 9,19,903 4,77,514 51.9
జిల్లా పేరు వర్కర్లు వ్యవసాయ కూలీలు శాతం
మహబూబ్​నగర్ 4,42,389 1,70,815 38.6
నాగర్ కర్నూల్ 4,56,762 1,90,030 41.6
నారాయణపేట 2,97,668 1,40,898 47.3
వనపర్తి 2,96,149 1,44,713 48.9
జోగులాంబ గద్వాల 3,28,086 1,83,459 55.9

వ్యవసాయమే ఆదాయ మార్గంగా ఉన్న వాళ్లు

జిల్లా పేరు వర్కర్లు వ్యవసాయం శాతం
వనపర్తి 2,96,149 60,914 20.6
మహబూబ్ నగర్ 4,42,389 1,00,052 22.6
జోగులాంబ గద్వాల 3,28,086 85,048 25.9
నారాయణపేట 2,97,668 81,911 27.5
నాగర్ కర్నూల్ 4,56,762 1,54,560 33.8

వేళ్లూనుకుపోయిన లింగవివక్ష

చదువుకున్నవాళ్లు, బడి ఈడు పిల్లలు, ఉద్యోగులు ఏ గణాంకాలు గమనించినా బాలికలు, మహిళల శాతం తక్కువగా ఉండటం సమాజంలో వేళ్లూనుకుని పోయిన లింగ వివక్షకు అద్దం పడుతోంది. 2011 జనాభా లెక్కలతో పోల్చితే నాలుగు జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 960 నుంచి 987 మంది మహిళలున్నారు. నారాయణపేట జిల్లాలో మాత్రం ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళల సంఖ్య 1009గా ఉంది. భావితరాలైన ఆరేళ్ల లోపు పిల్లల్లో లింగ నిష్పత్తులు పాలకులను అప్రమత్తం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆరేళ్లలోపు పిల్లల్లో ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు.. 903 నుంచి 949 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. రాష్ట్ర సగటు లింగ నిష్పత్తి, జాతీయ సగటు లింగ నిష్పత్తితో పోల్చినా పోల్చినా ఈ సంఖ్య చాలా తక్కువ.

లింగ నిష్పత్తి

జిల్లా పేరు పురుషులు మహిళలు

ప్రతి వెయ్యి మంది

పురుషులకు మహిళల సంఖ్య

వనపర్తి 2,94,833 2,82,925 960
నాగర్​కర్నూల్ 4,37,986 4,23,780 968
జోగులాంబ గద్వాల 3,09,274 3,00,716 972
మహబూబ్​నగర్ 4,62,870 4,57,033 987
నారాయణపేట 2,82,231 2,84,643 1009

ఇవీ చూడండి: నేటి నుంచి అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం

ABOUT THE AUTHOR

...view details