ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రెండు, మూడు గ్రామాలకు ఒకటి చొప్పున ప్రతి పల్లెకు అందుబాటులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లేదా మహిళా గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 225కు 150 కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. 12 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేశారు.
జిల్లా | ప్రారంభమైన కేంద్రాలు | లక్ష్యం( మెట్రిక్ టన్నుల్లో ) |
జోగులాంబ గద్వాల | 56 | లక్ష |
వనపర్తి | 133 | 2 లక్షలు |
నాగర్ కర్నూల్ | 79 | 2 లక్షల 50 వేలు |
నారాయణపేట | 105 | 78 వేలు |
ముందుగా వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాల్లో పర్యటించి కోసిన పంటను పరిశీలించి తేమశాతం ఆధారంగా ఎప్పుడు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వెళ్లాలో టోకెన్లు జారీ చేస్తున్నారు. వారిచ్చిన తేదీ ప్రకారం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నేరుగా రైతుల కళ్లాల్లోకి వెళ్లి ధాన్యాన్ని తూకం వేసి కొనుగోలు చేస్తున్నారు. లారీలు వెళ్లలేని పరిస్థితి ఉంటే రోడ్డుకు దగ్గర్లో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని ముందే సూచిస్తున్నారు. లేదంటే కళ్లాల నుంచి ట్రాక్టర్లలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి అక్కన్నుంచి లారీల్లో తరలిస్తున్నారు. ఎక్కడికక్కడే కొనుగోలు చేయడం వల్ల రైతులు గుమికూడకుండా చేయాలన్నది అధికారుల లక్ష్యం. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు రైతులకు అందుబాటులోనే జరుగుతున్నాయి.
ఐదు జిల్లాల పరిధిలో కొనుగోలు కేంద్రాల సంఖ్య గతంలో కంటే రెట్టింపు కావడం వల్ల తేమశాతం కొలిచే యంత్రాలు, తూకాలు, గన్నీ బ్యాగుల కొరత ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లాలో 225 కేంద్రాలకు 150 తేమ యంత్రాలే ఉన్నాయి. తూకం వేసే యంత్రాలు సైతం మరో 100కు పైగా అవసరం ఉన్నాయి. కొనుగోళ్లకు సరిపడా సుమారు 14లక్షల గన్నీబ్యాగులు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో 222 కేంద్రాలకు 173 తేమశాతం కొలిచే యంత్రాలున్నాయి. తూకం యంత్రాల కొరత లేదు. 50లక్షల గన్నీబ్యాగులకు 17లక్షలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వాటిని సమకూర్చుకోవాల్సి ఉంది.