Paddy procurement problems in mahabubnagar: గతేడాది వానాకాలం, యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరచుకున్నా ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో ఎక్కువ మంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి ధాన్యాన్ని అమ్ముకున్నారు. అలాంటి ధాన్యాన్ని వ్యాపారులు తిరిగి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో ధాన్యానికి దక్కే ధర తక్కువ. తెలంగాణలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర రూ.1960 కొనుగోలు చేస్తారు. ఈసారి ఈ తరహా అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో....అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో అధికారులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు, కేటీ దొడ్డి మండలం నందిన్నె, గట్టు మండలం బల్గెరలో పోలీసు, రెవిన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో కూడిన అధికారుల బృందం చెక్ పోస్ట్ ల వద్ద ధాన్యం రాకను పర్యవేక్షించనుంది. ధాన్యంతో వచ్చే లారీలను అక్కడినుంచే తిప్పి పంపుతున్నారు.
వేరే రాష్ట్రాల నుంచి వరి ధాన్యాన్ని ఇక్కడి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి.. అమ్ముతున్నారు. వేరే రాష్ట్రం నుంచి ధాన్యం వస్తున్నట్లుగా సమాచారం అందింది. అందుకే ప్రత్యేక బృందాలు పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు. ధాన్యాన్ని అమ్మడానికేనా? లేదా వేరే దగ్గరకు ధాన్యం తీసుకెళ్తున్నారా? అని ఆరా తీస్తారు. ధాన్యం లారీలను క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటున్నారు. చిన్నచిన్న రహదారుల వద్ద కూడా తనిఖీలు జరపాలని ఆదేశించాం.
-రఘురామశర్మ, జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్
అక్రమాలకు అడ్డుకట్ట
గతేడాది వానాకాలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వనపర్తి జిల్లాలోని ఓ కొనుగోలు కేంద్రంలో అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తిరిగి అదే రైతుల ద్వారా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వ్యాపారులు మద్దతు ధరకు అమ్మారు. ఈ ఏడాది ఆ తరహా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ధాన్యం అమ్మాలంటే రైతు ఆధార్ నంబర్- మొబైల్ నెంబర్ అనుసంధానంతో పాటు పంటల నమోదులో వివరాలు ఉండాలనే నిబంధన విధించారు.ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్న సాంకేతిక నిబంధనల కారణంగా ఆధార్‌తో మొబైల్ నంబర్ అనుసంధానం కాని రైతులు, పంటల నమోదులో పేర్లు నమోదు వాళ్లు, రైతుబంధు దస్త్రాల్లో వివరాలు లేని వాళ్లు అవి పూర్తయ్యే వరకూ ధాన్యం అమ్ముకోలేక పోతున్నారు.
మా ఊరికి అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చినప్పుడు నేను పంట నమోదు చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఏవో దగ్గరకు పోయి నమోదు చేసుకున్న తర్వాతే ధాన్యం తీసుకురావాలని చెబుతున్నారు. ఒక్కరి పేరు మీద అమ్మడానికి అవడం లేదు. భూమి ఎంత ఉంటే అంత మాత్రమే కొంటామని చెబుతున్నారు. తక్కువ ధాన్యం ఉన్నవాళ్ల ఖాతాలో అమ్ముతున్నాం. రైతుకు ఎంత పండితే అంత తీసుకుంటే బాగుంటుంది. కానీ అలా తీసుకుంటలేరు. భూమి ఎంత ఉంటే అంతే తీసుకుంటామని చెబుతున్నారు.