Delay in Telangana Paddy Procurement Amount :అకాల వర్షాలు.... మిల్లర్ల కొర్రీలు..... తాలు పేరిట తూకాల్లో కోతలు..... అన్ని అడ్డంకులు దాటుకుని సర్కారుకు ధాన్యం అమ్మిన రైతులకు ఆఖరికి చుక్కెదురవుతోంది. ధాన్యం అమ్మి నెలరోజులు గడుస్తున్నా ఇప్పటికీ డబ్బులు ఖాతాల్లో జమ కాలేదు. ఓవైపు యాసంగి సాగు కోసం చేసిన అప్పులు తీరక మరోవైపు వానాకాలం పంటల కోసం పెట్టుబడులకు పైకం లేక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధాన్యం డబ్బులు అందక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కథనం.
Paddy Procurement Amount Delay in Telangana :యాసంగి సీజన్‌లో వరి పండించిన రైతుల కష్టాలు అన్నీఇన్నీకావు. ఆరుగాలం శ్రమించి పంటపండించడం ఒక ఎత్తైతే, పండించిన పంటను అమ్ముకోవడం, అకాల వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకోవడం రైతులకు ఎక్కడలేని ఇబ్బందుల్ని తెచ్చిపెట్టింది. కొనుగోళ్లు మొదలు కాక, మొదలైనా వాటిని తీసుకెళ్లడానికి లారీలు లేకా ఇలా రైతన్నలు పడిన ఇబ్బందులు చిన్నవి కావు. అకాల వర్షాల కారణంగా ధాన్యం కొనేటప్పుడు మిల్లర్లు వాటి తేమ శాతం వంక చూపించి తరుగు ఎక్కువ తీశారు. అలా కూడా రైతులు నష్టాన్ని భరించారు.
Payments Delay to Telangana paddy farmers : అన్నిరకాల కష్టనష్టాలకు ఓర్చి, వ్యయప్రయాసలు భరించి తీరా పంట అమ్ముకుంటే రావాల్సిన డబ్బులు కూడా సకాలంలో రాక అన్నదాతలో అరిగోస పడుతున్నారు. ధాన్యం అమ్మి నెల రోజులకు పైగా గడుస్తున్నా ఇప్పటికి డబ్బులు అందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
'కొనుగోళ్ల కేంద్రాల దగ్గరికి వెళ్లిన తర్వాత క్వింటాకు 10 కిలోల చొప్పున తరుగు తీశారు. ఎలాగో అలా.. ధాన్యం కొనుగోలు పూర్తైంది. ఇక ఇప్పుడు ధాన్యం అమ్మి నెల కావొస్తున్నా పైసల జాడ లేదు. ఇన్నాళ్లూ ఓ బాధ.. ఇప్పుడు మరో తంటా. యాసంగి పంట కోసం తీసుకున్న అప్పులు చెల్లించడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇప్పుడు వానా కాలం పంట వేయడానికి పైసా లేదు. సర్కారేమో ఇప్పటికీ మా డబ్బు చెల్లించడం లేదు. ఇలాగైతే మేం సాగు చేసేదెలా' - బాధిత రైతులు