Paddy Crops Drying Up in Jurala Right Canal Area: జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల కుడి కాలువ పరిధిలో అధికారిక అంచనాల ప్రకారం.. 15 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. అనధికారికంగా చాలా పంట పొలాలకు నీరు అందుతుంది. కొంతమంది అన్నదాతలు జూరాల జనాలకు మోటర్లు బిగించుకొని నీరు తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. జూరాల అధికారులు అయ్యే సమావేశంలో 15 వేల ఎకరాలకు నీరు అందిస్తున్నామన్నారు.
ఈ ఏడాది రబీ సాగులో రైతులు సాగు చేసిన వరి పంటకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి దశలో నీరు అందకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. పంటలను కాపాడుకునేందుకు కొంతమంది రైతులు పక్కనే బోరు వేసుకొని పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న ఫలితం లేదని అంటున్నారు. ఈ ఏప్రిల్ నెల నీరు ఇస్తే తప్ప పంటలు గట్టెక్కే పరిస్థితి లేదని వారు చెబుతున్నారు.
కాలువకు నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి: వారబంది ప్రకారం నీరు వదులుతున్న.. సరైన గేజీలో వదలకపోవడంతో డిస్ట్రిబ్యూటర్ల పరిధిలో కాలువలకు నీళ్లు రాక పంటలు ఎండుతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కొంతమంది రైతులు రాత్రులు నిద్ర పోకుండా కూడా కాలువల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలు డిస్ట్రిబ్యూటర్లు శిధిలావస్థకు చేరుకోవడంతో నీళ్లు కాలువలకు పారకపోవడం పంటకు తీవ్ర నష్టం నెలకొని ఉందని వాపోతున్నారు.
కాలువల నిర్వహణ పర్యవేక్షణ లేకపోవడంతో నీటి వృధా సాధారణంగా మారింది. జూరాల జలాశయంలో నీటి కొరతతో వారబంది పద్ధతిలో సాగునీరు విడుదల చేస్తున్నారు. పంటలకు సాగు చేసుకోవాలని వ్యవసాయ నీటి పారుదల శాఖ అధికారులు రైతులకు సూచించిన.. ఆ పంటలకు భూములు అనుకూలంగా లేకపోవడంతో అన్నదాతలు వరి సాగుకు మగ్గుచూపుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లా ప్రాంతాలకు తాగునీరు ఈ ప్రాజెక్టు నుంచే: జూరాల జలాశయం నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా నేడు జూరాల నీటి నిలువ 3.80 టీఎంసీల మేరకు ఉంది. ఇందులో 0.093 టీఎంసీ నీళ్లు మాత్రమే సాగునీటికి అవసరాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. మిగతా నీటిని తాగునీటి అవసరాల కోసం నిలువ చేసుకోవాలి. అయితే జూరాల ప్రాజెక్టుపై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాంతాలకు తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారానే అందిస్తున్నారు. ఉన్న నీటిని సాగునీటి అవసరాల కోసం తరలిస్తే తాగునీటి అవసరాలకు ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కుడి కాలువ పరిధిలో ఉన్న పంటలకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని అధికారులు చెబుతున్నారు.
వారంలో మూడు రోజులే నీళ్లు వస్తున్నాయి. ఆ మూడు రోజులు గొడవలే అవుతున్నాయి. అవి కేసులు దాకా పోతున్నాయి. కానీ అధికారులు ఎవరు స్పందించట్లేదు. మాకు ఇప్పటికే ఏడు ఎకరాలలో.. ఎకరంన్నర ఎండిపోయింది. ఇంకో ఎకరంన్నర ఎండిపోయేలా ఉంది. నీళ్లు పైన ఉన్న వారికే సరిపోతున్నాయి. కిందకి నీళ్లు రావట్లేదు. దీంతో రోజుకి ఒక ఎకరం చొప్పున ఎండిపోతుంది. -రైతులు
నీళ్లు రాక ఎండిపోతున్న వరి పంటలు.. బోర్లు వేసినా తప్పని ఇబ్బందులు ఇవీ చదవండి: