అధిక ఆదాయం పేరుతో ఆన్‌లైన్ మోసం.. యాప్‌లో లక్షల్లో పెట్టుబడులు..! Online Fraud in Mahbubnagar: ఊరు, పేరు తెలియని అంతర్జాలసంస్థల్లో పెట్టుబడులు పెట్టొద్దని పోలీసుశాఖ విస్తృత ప్రచారంచేస్తున్నా అత్యాశకు పోతున్నజనం లక్షల్లో పెట్టుబడులు పెట్టి చివరకు మోసపోతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికే ఇలాంటి మోసాలు ఎన్నో బయటకు రాగా మరో ఆన్‌లైన్ మోసం పోలీస్‌స్టేషన్‌కి చేరింది. క్యాటర్ పిల్లర్ ఆనే ఆన్‌లైన్ యాప్‌లో లక్షల్లో పెట్టుబడులు పెట్టి మోసపోయామంటూ, సుమారు 40 మంది బాధితులు, మహబూబ్‌నగర్ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
యాప్‌లో చూపిన భారీ వాహనాలను అద్దెకిచ్చి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని పెట్టుబడి పెట్టిన వారికి అందిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. 600 నుంచి 10లక్షల వరకు ఎంతైనాసరే పెట్టుబడి పెట్టి, క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చంటే అంతా నమ్మారు. తొలత చిన్నమొత్తాలతో ప్రారంభించి ఖాతాల్లో డబ్బులు జమయ్యే సరికి పెట్టుబడుల్ని పెంచారు.
ఒకర్నిచూసి మరొకరు, ఒకే ఇంటి నుంచి ఐదారుగురు, స్నేహితులు, బంధువులు ఆ విధంగా వందల మంది చేరారు. దీపావళికి ఎక్కువ ఖాతాలు తెరిస్తే, ఎక్కువ ఆదాయం వస్తుందని, ముందుగా చెల్లించిన డబ్బులు సైతం నెలరోజుల్లో తిరిగి ఇస్తామని చెప్పేసరికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న అత్యాశతో ఒక్కొక్కరు లక్షల్లో ఆన్ లైన్‌లోనే పెట్టుబడులు కుమ్మరించారు.
ఊహించని ఆదాయాన్ని అందుకోబోతున్నామని కలలు కంటున్న సమయంలోనే ఈనెల 8 నుంచి యాప్ పనిచేయడం మానేసింది. సాంకేతికలోపమని రెండు నుంచి మూడు రోజులు సర్దుకున్నా, ఆ తర్వాత అప్లికేషన్ తెరచుకోకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించారు. క్యాటర్ పిల్లర్‌తో మోసపోయిన వాళ్లలో, విద్యావంతులు, వ్యాపారస్తులు, రోజువారీ వేతనంతో బతికే వాళ్లు, సాధారణ మధ్య తరగతి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.
ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారే 400 మంది ఉన్నారని బాధితులు చెబుతున్నారు. ఐదు జిల్లాల వ్యాప్తంగా ఇంకా ఎక్కువమంది ఉంటారని, జరిగిన మోసం కోట్లలో ఉంటుందని తెలిపారు. వరంగల్‌కు చెందిన ఓ బీటెక్ విద్యార్థి పంపిన లింక్ నుంచే మోసం ప్రారంభమైందని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి యాప్‌లే లేకుండా నిషేధించాలని, అలాగైతేనే సామాన్య జనం మోసపోరని సూచిస్తున్నారు.
బాధితులిచ్చిన ఫిర్యాదు చూపిన సాక్షాల ఆధారంగా నేరస్థులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని రెండో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. క్యాటర్ పిల్లర్ యాప్‌లో చేరిన సభ్యులు కేవలం ఉమ్మడి పాలమూరు జిల్లాకు మాత్రమే పరిమితం అయ్యారా లేక రాష్ట్రవ్యాప్తంగా బాధితులున్నారా, అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ క్రైం, ఐటీకోర్ టీం రంగంలోకి దిగి.. ఆధారాల కోసం వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇవీ చదవండి: