సత్ఫలితాలిస్తోన్నా... అంగన్వాడీల్లో కనిపించన న్యూట్రిషన్ గార్డెన్లు Nutrition Garden: అంగన్వాడీ కేంద్రాలకొచ్చే లబ్దిదారులకు.. సేంద్రియ విధానంలో పండించిన ఆకుకూరలు, కూరగాయలతో పౌష్ఠికాహారం అందించేందుకు న్యూట్రిషన్ గార్డెన్‌లను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో విధిగా పెరటి తోటలు పెంచాలని సూచించింది. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో అంగన్వాడీ నిర్వహకులు కిచెన్‌గార్డెన్‌ల వైపు ఆసక్తి చూపడంలేదు. సగానికిపైగా కేంద్రాల్లో పెరటితోటలు కనిపించడంలేదు. అమలు చేసిన చోట మాత్రం మంచి ఫలితాలు వస్తున్నాయి. హన్వాడ మండల కేంద్రంలోని మొదటి అంగన్వాడీ కేంద్రంలో పెరట్లో పండించిన కూరగాయలు, ఆకుకూరల్నే వండి వడ్డిస్తున్నారు. రసాయనాలు లేకుండా పండించడం వల్ల ఆహారం రుచిగా ఉండడంతోపాటు.. కూరగాయల ఖర్చులు తగ్గించుకోగలిగామని నిర్వహకులు అంటున్నారు.
వసతులు లేవంటూ నిర్లక్ష్యం..
సగానికి పైగా కేంద్రాల్లో కిచెన్ గార్డెన్‌ల పెంపకం అమలు కావడం లేదు. సొంత భవనం లేదని, అద్దె భవనాల్లో స్థలం, నీటి వసతులు లేవనే కారణాలతో తోటలు పెంచడంలేదు. అంగన్వాడీ కేంద్రాల్లో స్థలం లేకపోతే ప్రైవేటు, ఇతర ప్రభుత్వ స్థలాల్లోనూ పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. డీఆర్డీఏ, మెప్మా, ఉద్యానశాఖల సహకారంతో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నా.. నిర్వహకులు ఆసక్తి చూపడంలేదు. కిచెన్ గార్డెన్లు తక్షణ అవసరమే అయినా.. స్థానిక పరిస్థితులు అనుకూలంగా లేవని అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు. అధికారులు మాత్రం అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పెంచాల్సిందేనని సూచిస్తున్నారు.
పిల్లలు, మహిళల్లో పౌష్ఠికాహార లోపం, రక్తహీనత, రోగ నిరోధకశక్తి లేమి వంటి రుగ్మతలు తగ్గించేందుకు పెరటి, మిద్దె తోటల పెంపకాన్ని విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంగన్వాడీల్లో అమలు ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది.
ఇదీ చూడండి: