తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదాయం లేని మార్కెట్ యార్డులు.. కనీస వసతులు లేక రైతుల ఇక్కట్లు - కనీస వసతులు లేని వ్యవసాయ మార్కెట్ యార్డులు

వ్యవసాయ మార్కెట్లకు రైతులు భారీగా తమ పంట ఉత్పత్తులను తీసుకువస్తున్నారు. నిత్యం వందలాది మంది వచ్చి సరకులు అమ్ముకునే వరకు అక్కడే ఉంటున్నారు. వారికి కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు మార్కెట్ పాలకవర్గాల వద్ద నిధులు లేకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలో పరిస్థితిపై ప్రత్యేక కథనం.

Non-income market yards —farmers ’dilemmas with no minimum facilities
ఆదాయం లేని మార్కెట్ యార్డులు

By

Published : Nov 12, 2020, 1:58 PM IST

మహబూబ్ నగర్ జిల్లాలో బాదేపల్లి, మహబూబ్ నగర్, దేవరకద్ర, నవాబుపేట వ్యవసాయ మార్కెట్ లు ఉన్నాయి. కొత్తగా బాలనగర్ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేసి పాలకవర్గాన్ని నియమించారు కానీ మార్కెట్ యార్డ్ లేదు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్​లో పండించిన మొక్కజొన్న, పత్తి, కందులు, వరి పంట ఉత్పత్తులను రైతులు మార్కెట్​కు తీసుకువస్తున్నాను. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో జిల్లాలో అత్యధికంగా క్రయ విక్రయాలు జరుగుతాయి. కానీ అక్కడ కనీస వసతులు లేవు. మరుగుదొడ్లు మూతపడ్డాయి. తాగు నీటి శుద్ధి కేంద్రం పనిచేయడం లేదు. పూర్తిస్థాయిలో లైట్లు వెలగడం లేదు. రైతులకు విశ్రాంతి భవనం లేక రాత్రి వేళలో చలికి వణుకుతూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఇక దేవరకద్ర మార్కెట్లో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరాయి. నవాబుపేటలో కనీస వసతులు లేవు. విశ్రాంతి భవనం, మరుగుదొడ్ల నిర్వహణ లేదు. మహబూబ్ నగర్ మార్కెట్ లో రైతు విశ్రాంతి భవనంలో సరైన వసతులు లేవు. బాలానగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నా మార్కెట్ యార్డ్ ఏర్పాటు స్థలసేకరణకే పరిమితమవ్వడం వల్ల క్రయవిక్రయాలు జరగడం లేదు. దీని నిర్మాణానికి నిధుల సమస్య అడ్డంకిగా మారింది.

మార్కెట్​కు ఆదాయం లేదు

వ్యవసాయ మార్కెట్లకు ప్రస్తుతం ఆదాయం లేదు. మార్కెట్లో క్రయవిక్రయాలపై పన్ను వసూలుకు సరైన మార్గదర్శకాలు లేక గందరగోళ పరిస్థితి నెలకొంది. గతంలో బయట చెక్ పోస్టులు పెట్టి వ్యాపారుల వద్ద అమ్ముకునే వారి నుంచి పన్నులు వసూలు చేసేవారు. ఆ వ్యవస్థను కేంద్రం రద్దు చేయడంతో మార్కెట్లకు ఆదాయం లేదు. మార్కెట్ యార్డులో సమస్యలు తిష్టవేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.నిధుల కొరతతో ఎక్కడ గొంగడి అక్కడే అన్నట్టు ఉంది పరిస్థితి.

నిధులు సమకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని జిల్లా మార్కెటింగ్ ఇంఛార్జి బాలామణి తెలిపారు. నవాబ్ పేట జడ్చర్ల మార్కెట్లలో వ్యాపార సముదాయాల కోసం టెండర్లు పిలుస్తామన్నారు. మార్కెట్ అధికారులతో వరి కొనుగోలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఒక్కొక్కటిగా సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి: యథేచ్ఛగా ఇసుక దందా.. అడ్డొచ్చిన వారిపై దాడులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details