వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా రెండో రోజూ అంతంతమాత్రంగానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా... 6 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 10 దస్త్రాలకు సంబంధించిన లావాదేవీలు మాత్రమే జరిగాయి. గతంలో ఒక్కోరోజు 450 నుంచి 600 వరకూ రిజిస్ట్రేషన్లు జరిగేవి. కొత్త విధానంలోనూ ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 24 స్లాట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉన్నా.. ఆ స్థాయిలో స్లాట్‌లు నమోదు కావడం లేదు. మక్తల్, నారాయణపేట, ఆత్మకూర్, అలంపూర్, కొల్లాపూర్, అచ్చంపేటలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగలేదు.
స్లాట్ బుక్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ప్రాపర్టీ టాక్స్ ఇండెక్స్ నంబర్-పీటీఐఎన్, టీపిన్, టాక్స్ అస్సెస్ మెంట్ నెంబర్ నిక్షిప్తం చేయాలని వెబ్‌సైట్ కోరుతోంది. చాలామందికి ఈ నంబర్లపై అవగాహన లేక, ఈ నెంబర్లు అందుబాటులో లేక దరఖాస్తు అక్కడితో ఆగిపోతోంది. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో ఆ వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. స్లాట్ బుక్ చేసుకున్నా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాక అధికారులు అడిగే దస్త్రాలు లేక లావాదేవీలు పూర్తి చేయలేకపోతున్నారు. సేల్, మార్జిగేజ్, గిఫ్ట్ డీడ్‌లకు సంబంధించిన సేవలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మార్జిగేజ్ రిలీజ్ డీడ్, సవరణలు, ఒప్పుదల దస్తావేజులు, భాగ పరిష్కార దస్తావేజులు, కిరాయి నామా దస్తావేజులు వంటి లావాదేవీలకు స్లాట్ బుకింగ్‌లో అవకాశం లేకుండా పోయింది.