ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాదాపు 90 రోజుల తరవాత పాత విధానం ద్వారా నేరుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పాత విధానంలో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తున జనం తరలి వస్తారని భావించిన యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లు సైతం చేసింది. టోకెన్లు, చెక్ స్లిప్‌లు అవసరమనుకున్న చోట బయోమెట్రిక్ నమోదు కోసం అదనంగా స్కానర్లు, వేలిముద్రల యంత్రాలు సైతం సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఊహించినట్లుగానే జనం ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్టార్ర్ కార్యాలయాలకు ముందుగానే చేరుకున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వరుస కట్టారు. కానీ డీటీసీపీ అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా క్రమబద్ధీకరించుకున్న వ్యవసాయేతర భూములను మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పడంతో సబ్ రిజిస్టార్ర్ కార్యాలయాల నుంచి జనం నిరాశతో వెనుదిరిగారు. అనుమతులు లేని ఇళ్ల స్థలాలు, భవన నిర్మాణాల రిజిస్ట్రేషన్లు మినహా మిగిలిన అన్ని లావాదేవీలు గతంలోలాగే కొనసాగాయి.
122 దస్తావేజులు నమోదు...
మహబూబ్‌నగర్ కార్యాలయంలో సోమవారం 33 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా జడ్చర్ల- 29, నాగర్ కర్నూల్ - 24, గద్వాల- 13 మక్తల్ - 7, కల్వకుర్తి- 5, నారాయణపేట- 5, వనపర్తి - 3, ఆత్మకూరు- 2, కొల్లాపూర్-1 చొప్పున దస్తావేజుల రిజిస్ట్రేషన్ అయింది. అచ్చంపేట, అలంపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క లావాదేవీ కూడా నమోదు కాలేదు. నమోదైన వాటిలో సేల్ డీడ్‌లు 30 ఉన్నాయి. మిగిలిన 92 దస్తావేజులు రద్దు, సవరణ, తనఖా, తనఖా విడుదల, బహుమతి ఇతర సేవలవి. సోమవారం జరిగిన లావాదేవీలతో రూ.18,19,510ల ఆదాయం రిజిస్ట్రేషన్లశాఖకు సమకూరింది.
అధికారుల పరిశీలన
మహబూబ్‌నగర్ సబ్ రిజిస్టార్ర్ కార్యాలయాన్ని జడ్పీ సీఈవో యాదయ్య పరిశీలించారు. రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తీరు, చేసిన ఏర్పాట్లను ఆరా తీశారు. నారాయణపేట రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కలెక్టర్ హరిచందన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. నాగర్ కర్నూల్ సబ్ రిజిస్టార్ర్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ మనుచౌదరి, ఆర్డీవో నాగలక్ష్మి పరిశీలించారు. గద్వాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో రాములు డీఎస్పీ యాదగిరి సందర్శించి.. పరిస్థితిని పర్యవేక్షించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎక్కువ మంది ఎల్‌ఆర్‌ఎస్‌పై స్పష్టత ఇవ్వాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు.