తెలంగాణ

telangana

ETV Bharat / state

NO RAINS: ఊరించి ఉసూరుమనిపించిన వరుణుడు.. లబోదిబోమంటున్న రైతన్న - తెలంగాణ తాజా వార్తలు

మే, జూన్ మాసాల్లో ఊరించిన వరుణుడు ఆ తర్వాత ముఖం చాటేశాడు. తొలకరి వానలకు మురిసిన రైతులు పత్తి, కంది సహా కొన్నిచోట్ల వరినార్లు వేసుకున్నారు. ప్రస్తుతం ఆశించిన వర్షాల్లేక అన్నదాతలు లబోదిబోమంటున్నారు. వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఎదురవుతోంది. వానల్లేక గతేడాదితో పోల్చితే సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా పడిపోయింది. సుమారు 10 మండలాల్లో లోటు వర్షపాతం నమోదయింది. వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే మరో 25 మండలాలు ఆ జాబితాలో చేరనున్నాయి. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో వర్షాల్లేక అల్లాడిపోతున్న రైతులు, పంటల పరిస్థితిపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

mahabubnagar rains
mahabubnagar rains

By

Published : Jul 7, 2021, 7:09 AM IST

ఊరించి ఉసూరుమనిపించిన వరుణుడు.. లబోదిబోమంటున్న రైతన్న

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో జూన్ మాసంలో మోస్తరుగా కురిసి రైతులను మురిపించిన వానలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. ఫలితంగా అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తొలకరిలో కురిసిన వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల రైతులు పత్తి విత్తనాలు వేశారు. ఆ తర్వాత వర్షాలు సరిపడా కురవక చాలాచోట్ల విత్తనాలు మొలకెత్తలేదు. మొలకెత్తిన విత్తనాలు సైతం కొద్ది రోజులకే ఎండిపోయాయి. దీంతో వేసిన పంటను తొలగించి మరోసారి వేశారు. కాని ఆశించిన వర్షాలు కురవక ప్రస్తుతం అవీ ఎండిపోయే దశకు చేరుకున్నాయి.

ఆ తర్వాత వర్షాలు పడినా..

కంది పంట వేసిన రైతుల పరిస్థితి సైతం ఇలాగే ఉంది. వరినార్లు వేసిన రైతులు నాట్లు వేసేందుకు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. కొన్నిచోట్ల నార్లు కూడా ఎండిపోతున్నాయి. వర్షాలు సంవృద్ధిగా కురిస్తేనే పంటకు ఎరువులు అందించే అవకాశం ఉంటుంది. సకాలంలో పోషకాలు అందకపోతే మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది. ఒక్కసారి ఎదుగుదల ఆగిపోతే ఆ తర్వాత పంట పెరిగినా మంచి దిగుబడులు రావు. దీంతో పంటలపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

5 జిల్లాల పరిధిలో.. మహబూబ్​నగర్​ జిల్లాలో 3, నాగర్​కర్నూల్ 5, వనపర్తి 2 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 30 మండలాల్లో సాధారణ వర్షపాతమే నమోదైనా, వానలు కొన్నిచోట్ల మాత్రమే కురిశాయి. కొద్దిరోజులు వర్షాభావ పరిస్థితులు కొనసాగితే ఈ మండలాలు సైతం ఆ జాబితాలో చేరనున్నాయి.

ప్రతికూల ప్రభావం..

జూన్ మాసంలో సగటున 7 రోజులు మాత్రమే వర్షాలు కురుశాయి. వానల్లేకపోవడం సాగు విస్తీర్ణంపైనా ప్రతికూల ప్రభావమే చూపింది. గతేడాది ఈ సమయానికి సుమారు 7లక్షల 20 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వానల్లేక ఈసారి జూన్ మాసాంతానికి కేవలం 4 లక్షల 20వేల ఎకరాల్లో మాత్రమే రైతులు పంటలు వేశారు. ఈ ఏడాది సుమారు 18 లక్షల 50 వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. వానాకాలం ప్రణాళికతో పోల్చితే ఇప్పటి వరకూ మహబూబ్​నగర్ జిల్లాలో 15 శాతం, నాగర్​కర్నూల్ జిల్లాలో 25 శాతం, వనపర్తి జిల్లాలో 3 శాతం, జోగులాంబ గద్వాల జిల్లాలో 8 శాతం, నారాయణపేట జిల్లాలో 50 శాతం పంటలు మాత్రమే సాగయ్యాయి. మరో 10 రోజులు వానలు కురవకపోతే అంచనాల్లో 60 నుంచి 70 శాతం మాత్రమే పంటలు సాగవుతాయని అధికారులు చెబుతున్నారు.

పత్తి, కంది, వరి లాంటి పంటలు వేసుకునేందుకు మరో 15 రోజుల వరకూ అవకాశం ఉందంటున్న వ్యవసాయశాఖ అధికారులు.. నీటి వనరుల లభ్యత లేకపోతే ఆరుతడి పంటలు, స్వల్పకాలిక పంటల వైపే రైతులు మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. ఇప్పటికే వేసిన పంటను కాపాడుకోవాలంటే బోరుబావులు ఇతర నీటి వనరుల ద్వారా ఒక్స తడితో పంటను రక్షించుకోవాలని చెబుతున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నారాయణపేట జిల్లాలో మినహా మిగిలిన నాలుగు జిల్లాల్లో వర్షపాతం సహా పంటల సాగు విస్తీర్ణం ఆశించిన మేర లేవు. పత్తి పంట సైతం అంచనాలతో పోల్చితే 50 శాతం మాత్రమే సాగైంది. కంది సైతం 30 శాతానికే చేరింది. వరి నార్లు సైతం 10 శాతం కూడా లేవు. ఈ నేపథ్యంలో ఆసారి కాలం కలిసి వస్తుందా లేదా అని అన్నదాతలు సహా అధికారులు సైతం ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇదీచూడండి:KCR ON WATER DISPUTES: 'స్వయం పాలనలో సాగునీటి కష్టాలు రానివ్వం'

ABOUT THE AUTHOR

...view details