Jurala Project Water Level :దక్షిణ తెలంగాణకు ఆదెరువు అయిన కృష్ణమ్మ వెలవెలబోతోంది. గతేడాది ఈ సమయానికి ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ.. 2 నెలలు కావొస్తున్నా వరుణుడు కరుణించక నీటిజాడ కనుమరుగవుతోంది. గతేడాది ఈ సమయానికే ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద మొదలుకాగా.. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ సారి జులై మధ్యలోకి వచ్చినా.. వరద రావడం లేదు. ఉమ్మడి పాలమూరుకు వరప్రదాయిని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నీటి సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసే వర్షాలతో ఆల్మట్టి నింపుతూ కృష్ణమ్మ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఎగువన రెండు రాష్ట్రాల్లో ఆశించిన మేర భారీ వర్షాలు లేకపోవటం, అక్కడి ప్రాజెక్టులకు ఇప్పటికీ ప్రవాహం లేకపోవటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
Jurala Project Water Level News :కృష్ణ, భీమా నదులు కలిసిన తర్వాత వచ్చే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి జనవరి మొదటి మాసంలో నీటిని విడుదల చేసే నాటికి పూర్తిస్థాయి నీటి మట్టం కలిగి ఉంది. అప్పటి నుంచి నీటి నిల్వ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రాజెక్టు నిల్వసామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.402 టీఎంసీలు మాత్రమే చేరుకుంది. ఈ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గద్వాల, అలంపూర్‌లో లక్షా 20వేల ఎకరాలు, ఎడమకాల్వ నుంచి వనపర్తి, కొల్లాపూర్, ఆత్మకూరు ప్రాంతాల్లో 60వేల ఎకరాలకు పైగా సాగు నీరందిస్తోంది. కృష్ణా నది ఇతర ఉపనదులు మరో 7నుంచి 9 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంటాయి. జూరాలకు అనుసంధానంగా నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా 1, 2, ఎత్తిపోతల పథకాలతోపాటు పలు తాగునీటి పథకాలు ఉన్నాయి. 80 టీఎంసీల వరద నీటిని తోడిపోస్తే తప్ప ఈ ప్రాజెక్టుల కింద పంటలకు నీరు అందే పరిస్థితి ఉండదు. ఇలాంటి నేపథ్యంలో ఈ సారి వరద ప్రవాహం లేకపోవటంతో ఆందోళనకు గురిచేస్తోంది.
"జూరాల ప్రాజెక్టులో నీరు వదలడం లేదు పంటలు సరిగ్గా పండడం లేదు. జూరాలపై ఆధారపడిన ప్రాజెక్టు రైతులు చాల మంది ఉన్నారు. కొన్ని రోజులైతే నాట్లు వేసుకోవాలి నీరు లేకపోతే ఎలా వేస్తాం. నీరు లేనప్పుడు రైతులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి ".- బాధిత రైతులు