Government Schools Facilities: పాలకులు మారినా.. ప్రభుత్వాలు మారినా.. సర్కారు బడుల తీరులో మార్పు రావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కరవయ్యాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్ఠం చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. సర్కారు, అధికారులు ఆచరణలో మాత్రం చూపడం లేదు. స్కూళ్లలో నీటి సౌకర్యం, అదనపు గదులు వంటి మౌలిక వసతులైనా కల్పించడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లాలోని చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు వంటి కనీస వసతులు లేవు.
ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు
మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 859 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 72,810 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటి పరిధిలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, నీటి సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉందని అధికారులు… గతేడాది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయినా… ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. దాదాపు 52 పాఠశాలల్లో మూత్రశాలలు లేవు. అన్నింటిలో కలిపి 2,088 మూత్రశాలలు ఉండగా... కేవలం వెయ్యి వినియోగంలో ఉన్నాయి. ఫలితంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.