మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని, విదేశాల నుంచి వచ్చిన సుమారు 205 మందిని క్వారంటైన్లో ఉంచామని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. క్వారంటైన్లో ఉన్నా.. కొందరు బహిరంగంగా తిరుగుతున్నారన్న సమాచారం ఉందని, అందుకే వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోనున్నామని ఆయన చెప్పారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని నిత్యవసరాల ధరలు పెంచి అమ్మితే పీడీ యాక్టు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
జిల్లాలో నీటి పారుదల, ఉపాధి హామీ, వ్యవసాయశాఖకు సంబంధించిన పనులు ఎక్కడా ఆగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు స్వీయ క్రమశిక్షణ పాటిస్తే.. పరిస్థితి సవ్యంగా సాగుతుందని.. గాడి తప్పితే పూర్తిస్థాయి కర్ఫ్యూ విధించాల్సిన అవసరం రావచ్చని హెచ్చరించారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని ఎస్పీ రెమా రాజేశ్వరి స్పష్టం చేశారు. డయల్ 100 ద్వారా ప్రజలు ఎలాంటి సహాయం కోరినా.. అందిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.