వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం జానంపేట గ్రామ శివారులో కానుగల వాగు ఉంది. జూరాల నుంచి భీమా ఎత్తిపోతల పథకానికి సాగు నీళ్లు విడుదల చేసినప్పుడు, వానలు బాగా కురిసినప్పుడు, పంట పొలాలు నిండినప్పుడు ఈ వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. వేసవిలో మినహా మిగిలిన అన్ని నెలల్లో వాగు ప్రవహిస్తూనే ఉంటుంది. జానంపేట మీదుగా హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి రంగాపూర్ వద్దకు చేరుకునేందుకు ఇదే దగ్గరి దారి. జానంపేట చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ ఈ దారి గుండానే పంట పొలాలకు వెళ్లాల్సి ఉంటుంది. వంతెన లేక కొందరు ధైర్యం చేసి ఆ వాగులోంచి ప్రయాణిస్తున్నారు. వర్షాలు పడినప్పుడైతే... పీకల్లోతు వరకు మునిగి అవతలి గట్టుకు చేరుకుంటారు.
కానుగల వాగుపై వంతెన నిర్మాణ పనులు 2007లోనే మంజూరయ్యాయి. 2009లో టెండర్లూ ఖరారయ్యాయి. పనులు కూడా ప్రారంభించారు. వంతెన వస్తుందని ఆశపడేలోపే పనులు నిలిపివేశారు. సుమారు కోటి 40 లక్షలతో చేపట్టిన ఈ పనులకు 70శాతం బిల్లులు చెల్లించినా... 50శాతం పనులు కూడా చేయలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గుత్తేదారు పనులు అలాగే వదిలిపెట్టినా ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవు. పాలకులు, ప్రభుత్వాలు మారినా వంతెన నిర్మాణం మాత్రం అలాగే ఉండిపోయింది.