మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చెరువులు, కుంటలు కలిపి దాదాపు 39కి పైగా జలవనరులు అందుబాటులో ఉన్నాయి. పాలమూరు పెద్ద చెరువు, చిన్న చెరువు, నల్ల చెరువు ఇలా నిజాం కాలం నుంచి గొలుసుకట్టుగా ఏర్పాటు చేశారు. ఒకప్పుడు వీటికి భారీ విస్తీర్ణం, ఆయకట్టు సైతం ఉండేది. నీళ్లు చేరేందుకు విశాలమైన కాలువలు, మత్తడి, ఆయకట్టుకు మార్గాలు ఉండేవి. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లోని చెరువులు, కుంటల ఉనికి క్రమంగా కనుమరుగవుతోంది. ఒకప్పటి గూగుల్ ఛాయాచిత్రాలు, తాజా గూగుల్ ఉపగ్రహ చిత్రాలను పోల్చిచూస్తే పరిస్థితి స్పష్టంగా అర్థమవుతోంది. చెరువులు, కుంటలన్నీ కుంచించుకుపోయాయి.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం గుండా జాతీయ రహదారి నిర్మాణం, నూతన కలెక్టరేట్, ఐటీ పార్క్, మయూరీ పార్క్, వైద్య కళాశాల ఇలా అనేక అభివృద్ధి పనులు జరిగాయి. ఫలితంగా భూములకు మంచి ధర ఏర్పడింది. చెరువులు, కుంటల భూములపై కబ్జాదారుల కన్ను పడింది. తాజాగా జిల్లా కేంద్రంలో ఇమామ్ సాబ్‌కుంట, దొంగలకుంట, చిన్నచెరువు, పెద్దచెరువు సహా పలు చోట్ల చెరువు శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలు, లే అవుట్లు వెలుస్తున్నాయి. చెరువులు కుంటల్ని పూడ్చేసి.. ఇళ్ల స్థలాలుగా మార్చేసి ఆమ్మేస్తున్నారు. కోట్ల విలువైన భూముల్ని యథేచ్ఛగా ఆక్రమిస్తున్నా.. పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
నిబంధనల ప్రకారం చెరువైనా, కుంటైనా ఫుల్ టాంక్ లెవల్-ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఇవేమీ లెక్కచేయకుండా చెరువు భూముల్ని కబ్జా చేస్తున్న అక్రమార్కులు ఇళ్ల స్థలాలుగా మార్చేసి అమ్ముతున్నారు. కాల్వలు సైతం ఆక్రమణల్లో కనుమరుగయ్యాయి. భారీ వర్షాలు కురిస్తే చెరువులు, కుంటలకు చేరాల్సిన నీళ్లు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పడల్లా ఆక్రమణలు కూల్చివేయడం.. తర్వాత పట్టించుకోకపోవడం అధికారులకు పరిపాటిగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.