Niranjan Reddy On Krishna Water: కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటాల పంపిణీ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల్ని అలాగే ఉంచి రాజకీయంగా ప్రయోజనం పొందాలనే దురుద్దేశంతో కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కృష్ణా నదీ జలాల్లో నీటివాటాల పంపిణీ రాష్ట్రవిభజన అంశమేనని.. దానిని కేంద్రమే సమస్యగా భావిస్తోందని విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం చోద్యం చూస్తుంది: నీళ్లన్నీ సముద్రం పాలవుతుంటే కేంద్రం చోద్యం చూస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. నదీజలాల అనుసంధానమంటూ నాటకాలాడుతోందని దుయ్యబట్టారు. కేంద్రం నీటి పంపిణీ చేసి అనుమతులిచ్చి ఉంటే.. ఇప్పటికే పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నీళ్లు ఇచ్చే వారమని అభిప్రాయపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి కింద దాదాపు అన్నిజలాశయాలు పూర్తయ్యాయని .. కానీ నీరు లేక ఖాళీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి వాటాలు తేలితే ఆంధ్రా-తెలంగాణ ఎవరి ప్రాజెక్టులు వారే నిర్మించుకుని ఉండేవాళ్లని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర వైఖరి ఏంటో రైతులు అర్ధం చేసుకోవాలని సూచించారు. త్వరలోనే యాసంగికి రైతుబంధు విడుదల చేయనున్నట్లు నిరంజన్ రెడ్డి వెల్లడించారు.