Mahabubnagar DiagnosticHub recognized by Accreditation Board: మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. వ్యాధినిర్థారణ పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలతో పాటు, నాణ్యమైన సేవలు అందిస్తున్నారని టెస్టింగ్ ల్యాబ్, కాలిబ్రేషన్ ల్యాబ్‌ల జాతీయ అక్రిడేషన్ బోర్డు ఎంట్రీ లెవల్ గుర్తింపు ఇచ్చింది. 2026 ఫిబ్రవరి 7 వరకు ఈ ప్రత్యేక గుర్తింపు కొనసాగనుంది.
తమిళనాడులోని వేలూర్ మెడికల్ సైన్స్ నుంచి బయోకెమిస్ట్రీ, మైక్రోబయోలజీ విభాగాల నుంచి సిరాలజీ, వైరాలజీ నమూనాలు, దేశ రాజధాని దిల్లీ ఏయిమ్స్ నుంచి సీబీపీ కోసం సమూనాలు పంపించింది. మహబూబ్‌నగర్‌లో వచ్చిన ఫలితాలను అంతకుముందే వేలూర్ ఏయిమ్స్ వచ్చిన ఫలితాలతో సరిచూసుకుంది. పరీక్ష ఫలితాలు కచ్చితంగా ఉండటంతో మహబూబ్‌నగర్‌లో నాణ్యమైన సేవలు అందిస్తున్నారని కేంద్ర సంస్థ గుర్తించింది
మహబూబ్‌నగర్ జిల్లా టి-హబ్ డయాగ్నస్టిక్ కేంద్రానికి జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీ, సీహెచ్‌సీ కేంద్రాల నుంచి రక్త నమూనాలు వస్తాయి. వాటిని పరీక్షలు చేసి 24 గంటల్లో ఫలితాలను నేరుగా రోగులకు మొబైల్ నెంబర్లకు పంపుతున్నారు. ఇప్పటి వరకు 3లక్షల 21వేల వైద్య పరీక్షలను నిర్వహించారు. ప్రస్తుతం 47రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా, వాటిని వచ్చే నెల నుంచి 133కు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.