Narayanpet Kodangal Lift Irrigation :మరాఠా, కన్నడ రాష్ట్రాల నుంచి పరుగులు తీసే కృష్ణానది నారాయణపేట జిల్లా కృష్ణా మండలం తంగిడిగి వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణలో కృష్ణమ్మ అడుగు పెట్టేది నారాయణపేట జిల్లాలోనే ఆయినా ఈ జిల్లాలోని ఎగువ ప్రాంతాలకు ఇప్పటికీ కృష్ణాజలాలు అందడం లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఆ ప్రాంతానికి సాగునీరిస్తామని బీఆర్ఎస్ సర్కారు హామీ ఇచ్చినా తొమ్మిదిన్నరేళ్లలో అది అమలు కాలేదు.
ఈ నేపథ్యంలో మరోసారి తెరమీదకు వచ్చిన అంశం నారాయణపేట - కొండగల్ ఎత్తిపోతల పథకం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ఎత్తిపోతల పథకంతో సాగునీరందించి మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజక వర్గాలను సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఇచ్చిన మాట ప్రకారం ఎత్తిపోతల పథకం చేపట్టాలని మెట్ట ప్రాంత రైతన్నలు కోరుతున్నారు.
Palamuru-Rangareddy: పాలమూరు-రంగారెడ్డిలో సాగునీరే ప్రధాన లక్ష్యం..
Palamuru Ranga Reddy Lift Irrigation Scheme :ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకుఅప్పటికే ఉన్న జూరాల, నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందుతోంది. కానీ మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజక వర్గాల్లో మెట్ట ప్రాంతాలకు ఈ పథకాల ద్వారా సాగునీరు అందే అవకాశం లేదు. అందుకే భీమా ఎత్తిపోతల పథకంలో భాగమైన భూత్పూరు జలాశయం నుంచి నాలుగు దశల్లో కానుకుర్తి వరకూ నీళ్లెత్తి పోసి అక్కడి నుంచి గ్రావిటీతో దౌల్తాబాద్, కొడంగల్ మీదుగా బొమ్మరాస్ పేట వరకూ చెరువులు నింపిలక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ పథకానికి రూపకల్పన చేశారని స్థానిక నేతలు.
"ప్రాథమిక దశలో జయమ్మ చెరువు ఎత్తిపోతల పథకం కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైకిల్ ర్యాలీ తీసి, వినతి పత్రం ఇచ్చాము. 2005 తర్వాత సీపీఎం పార్టీ ఆధర్వంలో సైకిల్ యాత్ర చేపట్టాం. ఆ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. దీన్ని కొడంగల్ వరకు విస్తరించి అమలు చేయాలి. ఆ తర్వాత కొడంగల్-నారాయణపేట్ ఎత్తిపోతల పథకంగా మార్చారు. ఏడున్నర టీఎంసీలను ఈ పథకానికి తీసుకొచ్చారు." -వెంకట్రాంరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి నారాయణపేట