losses for Nagar Kurnool Mango Farmers : చెట్టు నుంచి తెంపితే కష్టం.. తెంపకుంటే నష్టం అన్నట్లుగా మారిపోయింది.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మామిడి రైతులు నష్టాల ఊబిలో చిక్కుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో సాగయ్యే కొల్లాపూర్ మామిడికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఫలాన్ని పండిస్తున్న రైతులు మాత్రం మూడేళ్లుగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఈసారి ఆనష్టాల తీవ్రత మరింత పెరిగింది.
దిగుబడి 30 శాతానికి పడిపోయింది:నల్ల తామర ఇతర చీడపీడలతో అసలు పూతే నిలవలేదు. వాటిని అరికట్టేందుకు రైతులు పెద్ద ఎత్తున పురుగుమందులు, ఎరువులు వాడటంతో పెట్టుబడులు పెరగ్గా.. కూత మాత్రం రాలేదు. దిగుబడులు 30 శాతానికి పడిపోయాయి. ఈమధ్య కురిసిన వడగళ్ల వానకి చాలావ చోట్ల మామిడి రాలిపోవటంతో ఉన్న దిగుబడి తగ్గిపోయింది. వచ్చిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో మామిడికి రేటే లేకుండాపోయింది.
వాస్తవ ధర కన్నా చాలా తక్కువకు పడిపోయిన మామిడి ధర: వాస్తవానికి దిగుబడి తగ్గినప్పుడు డిమాండ్ పెరిగి రేటుపెరగాలి కానీ అందుకు భిన్నంగా ఈసారి ధరలు దారుణంగా పడిపోయాయి. పెట్టిన పెట్టుబడి వచ్చినా.. దిగుబడి చూస్తే క్వింటాకు 60 నుంచి 70 వేల వరకు పలికితే తప్ప గిట్టుబాటు కాదని.. అలాంటిది 25 నుంచి 30 వేలు పలికితే పెట్టుబడులు చేతికి రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి తగ్గిపోవడంతో పంటను హైదరాబాద్ వంటి మార్కెట్లకి తరలించే పరిస్థితి లేకుండా పోయింది. కొల్లాపూర్‌లో మార్కెట్ సౌకర్యం లేకపోవటంతో దళారులు చెప్పిన ధరకు రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో 22 వేల వరకు ఎకరాల వరకు మామిడి తోటలు ఉండగా వాటిని కౌలురైతులే గుత్తకు తీసుకుంటారు. అలాంటి కౌలురైతులంతా ఈసారి పెద్ద ఎత్తున నష్టపోయారు.