తొలిసారిగా జడ్చర్ల పురపాలికకు ఎన్నికలు - Telangana municipality election news
మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల పురపాలిక ఎన్నికల కోసం నగారా మోగింది. ఛైర్మన్ పదవులు సహా వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించడం.. ఎన్నికల కోసం ప్రకటన విడుదల కావడంతో రాజకీయ సందడి మొదలైంది. తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్న జడ్చర్లలో పాగా వేసేందుకు తెరాస సహా విపక్షాలు ఈ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
పురపాలికలకు ఎన్నికలు
By
Published : Apr 15, 2021, 8:58 PM IST
మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల పురపాలిక, జోగులాంబ గద్వాల అలంపూర్ పురపాలికలోని ఐదో వార్డు ఎన్నికల కోసం ప్రకటన విడుదలైంది. ఈనెల 16 నుంచి 18 వరకు ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. 19న నామపత్రాలు పరిశీలన, 20న తిరస్కరణ, 22 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. బరిలో నిలిచే అభ్యర్థుల తుదిజాబితాను 22న సాయంత్రం 3 గంటలకు ప్రదర్శిస్తారు. 30న పోలింగ్, మే 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
మినీపోరు కోసం సన్నద్ధం...
రాష్ట్రంలో జరిగే ఈ మినీపోరు కోసం ఇప్పటికే అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఓటర్ల జాబితా, కులగణన, వార్డుల వారీగా రిజర్వేషన్లు, ఛైర్మన్ అభ్యర్థి రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలను గుర్తించి, సిబ్బందిని సైతం ఎన్నికల కోసం సిద్ధంగా ఉంచారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పురపాలిక ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా... ఇప్పటికీ ఎన్నికలు జరగలేదు. తాజాగా కావేరమ్మపేట గ్రామపంచాయతీ పాలక వర్గం గడువు ముగియగా జడ్చర్ల, బాదేపల్లి, కావేరమ్మపేటలను కలిపి జడ్చర్ల మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు.
మొదటిసారిగా ఎన్నికలు...
జడ్చర్ల మున్సిపాలిటీకి మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. పురపాలికను మొత్తం 27 వార్డులుగా విభజించారు. 27 వార్డుల్లో ఎస్టీలకు-1, ఎస్సీ జనరల్-2, ఎస్సీ మహిళ-1, బీసీ జనరల్-5, బీసీ మహిళ-4, మహిళ జనరల్-8, జనరల్ కేటగిరిలో 6 వార్డులను కేటాయించారు. మున్సిపాలిటీ మొత్తంలో 41, 515 మంది ఓటర్లుండగా వారిలో పురుష ఓటర్లు 20,765 మంది కాగా.. మహిళ ఓటర్లు 20749 మంది ఉన్నారు. పట్టణ వ్యాప్తంగా మొత్తం 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వార్డుల వారీగా కులగణన ఓటర్ల జాబితాను సైతం ఇప్పటికే ప్రకటించారు.
ఐదో వార్డుకు...
రెండు మున్సిపాలిటీలతో పాటు అలంపూర్ మున్సిపాలిటీలోని 5వ వార్డుకు సైతం ఎన్నికలు జరగనున్నాయి. గతం ఎన్నికల్లో ఏక్రగ్రీవంగా ఎన్నికైన కౌన్సిలర్ అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు కోల్పోగా ఐదో వార్డుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ వార్డు ఇప్పటికే ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది.
జడ్చర్ల పురపాలిక వార్డులు వాటి రిజర్వేషన్ల వివరాలు