తెలంగాణ

telangana

ETV Bharat / state

Road problems: వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న గండీడ్‌-కోస్గి రోడ్డు.. అడుగడుగునా పరీక్షలే! - తెలంగాణ వార్తలు

నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే కీలకమైన రహదారి. రాష్ట్రాలను, జిల్లాలను, పల్లెలను కలిపే ప్రధాన మార్గం. కానీ రోడ్డంతా అతుకులు... అడుగడుగునా గుంతలు(Road problems). ఆ మార్గంలో ప్రయాణం నరకంతో సమానం. వాహనదారులకు చుక్కలు చూపెడుతున్న మహబూబ్​నగర్ జిల్లా గండీడ్-తాండూర్‌ రహదారి దుస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Road problems 2021, mahabubnagar district roads
వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న గండీడ్‌-కోస్గి రోడ్డు, మహబూబ్​నగర్ జిల్లాలో రోడ్డు సమస్యలు

By

Published : Oct 9, 2021, 7:16 PM IST

వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న గండీడ్‌-కోస్గి రోడ్డు

హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్- బీజాపూర్ రెండు జాతీయ రహదారులను కలిపే లింక్ రోడ్డు అది. మహబూబ్​నగర్ నుంచి కొడంగల్, తాండూర్​లను కలుపుతూ చించోలీ వరకూ వెళ్లే ప్రధాన రహదారి. పారిశ్రామిక అవసరాల కోసం నిత్యం వందలాది భారీ వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటాయి. మహబూబ్‌నగర్ నుంచి హన్వాడ, గండీడ్, కోస్గి, కొడంగల్, తాండూరు వరకూ వెళ్లే వందలాది బస్సులకు ఇదే మార్గం. పల్లెలకు లెక్కలేనన్ని ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్తుంటాయి. అంత రద్దీ ఉండే ఈ రహదారి.... ప్రయాణికులకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. గండీడ్ మొదలుకొని కోస్గి వరకు, అక్కణ్నించి తాండూరు వరకూ రోడ్డంతా గందరగోళంగా మారింది. అడుగడుగునా గుంతలతో(Road problems)హనదారులకు పరీక్షలు పెడుతోంది.

ప్రయాణ సమయం రెట్టింపు..

గుంతల కారణంగా వాహనాలు త్వరగా మరమ్మతులకు వస్తున్నాయని.... పొట్టకూటికి ఆటోలు నడుపుకునే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణ సమయం రెట్టింపు అవుతోందని... రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాల(Road problems) బారిన పడుతున్నామని గోడు వెళ్లబోసుకుంటున్నారు. వర్షాలు పడితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు.

రోడ్డు అంతా కట్టలు, గుంతలుగా ఉంది. బండ్లు సరిగా పోవు. 15 కి.మీ పోవడానికే గంట టైం పడుతుంది. రోడ్లు సరిగా లేక తరుచుగా ఆక్సిడెంట్లు జరుగుతున్నాయి. పేషంట్లను తోలుకుపోవాలన్న చాలా రిస్క్ అవుతోంది. లారీలు ఎక్కడివి అక్కడే ఆగిపోతున్నాయి. ఆటోలు నడపడం చాలా కష్టంగా ఉంది. రోజూ లారీలు, బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. వాన పడిందంటే రోడ్డే కనిపించదు. ప్రజాప్రతినిధులను అడిగితే.. ఇంతే వచ్చిందని చెబుతున్నారు.

-స్థానికులు

మహబూబ్​నగర్ నుంచి చించోలీ వరకూ కొత్తగా కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిని మంజూరు చేసింది. త్వరలో టెండర్లు పూర్తయి నిర్మాణం ప్రారంభం కానుంది. అంతకుముందు ఈ మార్గం రోడ్లు భవనాలశాఖ ఆధీనంలో ఉండేది. మహబూబ్​నగర్ నుంచి గండీడ్ వరకూ కొత్తగా వేసిన రోడ్డు పూర్తయింది. కానీ గండీడ్ నుంచి కోస్గి వరకూ అలాగే ఉండిపోయింది. జాతీయ రహదారి మంజూరు కావడంతో పనులు పూర్తిగా ఆగిపోయాయి. జాతీయ రహదారని ఏళ్లుగా వింటున్నామంటున్న స్థానికులు... అప్పటివరకు తాత్కాలిక మరమ్మతులైనా చేపట్టాలని కోరుతున్నారు.

వర్షాలు పడితే పెద్ద గుంతలు చెరువుల్లాగా మారుతాయి. టూ వీలర్స్ పోతే... టైర్ల వరకు మునుగుతుంది. 108 వాహనం పోవడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రాణాలు పోతుంటాయి. చుట్టుపక్కల ఉన్న ఊరి నుంచి మహబూబ్​నగర్ వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కర్నూల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తొందరగా పోవచ్చని వస్తారు. రోజుకూ దాదాపు 3 లేదా 4 వేల వాహనాలు పోతుంటాయి. ఈ రోడ్డు వల్ల ఆటోలైతే వారానికి ఒకసారి రిపేర్​కు పోతాయి. ఇక చిన్నకార్లయితే డోర్ల నుంచి వాటర్ వస్తాయి. వంద మీటర్లు పోవడానికి మినిమమ్ 15 నిమిషాల సమయం పడుతుంది. అంతా పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి. వర్షం వస్తే రోడ్డా? లేక వాగా? అన్నట్లు ఉంటుంది.

-స్థానికులు

మంత్రులు, శాసనసభ్యులు కాస్త చొరవ చూపి తాత్కాలిక మరమ్మతుల కోసం నిధులు తీసుకురావాలని స్థానికులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:Rains in Hyderabad: గుంతపల్లి-మజీద్‌పూర్ మార్గంలో వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

ABOUT THE AUTHOR

...view details