కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో ఉంటున్నవారికి అత్యవసర పరిస్థితులు ఎదురైతే మహబూబ్‌నగర్ జిల్లాల్లో పట్టించుకోవడం లేదు. హైదరాబాదుకు వెళ్లేసరికి పరిస్థితి విషమిస్తోంది. ఒక్కోసారి అక్కడ కూడా చేర్చుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితి ఉంటోంది.
మరోవైపు.. మునుపటిలా క్షేత్రస్థాయిలో గర్భిణులకు అందుతున్న సేవలపై పర్యవేక్షణ చేసేవారు లేకుండా పోయారు. ఆశాలు, ఏఎన్‌ఎంలు కరోనా సర్వేల్లో ఉండటం వల్ల గ్రామాల్లో సరైన పర్యవేక్షణ సాగడం లేదు. ఈ నేపథ్యంలో కాన్పు కోసం ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్న పరిస్థితులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నెలకొంటున్నాయి.
కరోనా విధుల్లో సిబ్బంది, వాహనాలు :
గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణుల ఆరోగ్య పరీక్షలు, వారి పరిస్థితులపై దృష్టి సారించే ఆశాలు, ఏఎన్‌ఎంలు గత నెల రోజులుగా కరోనా వైరస్ నియంత్రణ పనుల్లో తలమునకలుగా పని చేస్తున్నారు. ఇదివరకు వీరు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేసి 102 వాహనాలను వినియోగించి గర్భిణులను తీసుకువెళ్లేవారు.
ఇప్పుడు సిబ్బందితోపాటు వాహనాలు సైతం కరోనా విధుల నిర్వహణలో ఉండటం వల్ల గర్భిణుల వైపు దృష్టి సారించేవారు లేరు. కేవలం ఫోన్లు చేసి వైద్య పరీక్షలకు వెళ్లాలని, కాన్పులకు ఫలనా ఆస్పత్రికి వెళ్లాలని మాత్రమే సిబ్బంది సూచిస్తున్నారు. ఆ తర్వాత వారు వెళ్తున్నారా? అన్నది కూడా చూడటం లేదు. మరోవైపు.. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులు పూర్తిస్థాయిలో సేవలు అందించడం లేదు. కొన్ని ఆస్పత్రులు మాత్రమే కాన్పులు చేస్తున్నాయి. అందరూ ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు.
మార్చి నెలలో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో 575 కాన్పులు జరిగితే.. ఏప్రిల్‌లో 604 జరిగాయి. భారం పెరిగినప్పటికీ వైద్యులు సీరియస్‌గా ఉన్న కేసులు వస్తేనే హైదరాబాదుకు రెఫర్ చేస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాల నుంచి గర్భిణులు వస్తే మాత్రం వారిని ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు వైద్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఇటువంటి కేసులు భాగ్యనగరంకు వెళ్లినా అక్కడా ఇవే పరిస్థితులు ఎదురవుతున్నాయి.
గర్భిణులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మహబూబ్‌నగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ ఈటీవీ భారత్కు తెలిపారు. వీరి కోసం ప్రత్యేకంగా 102 వాహనాలను వినియోగిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ఏమైనా లోపాలుంటే సరిచేసి గర్భిణులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఉమ్మడి జిల్లా మార్చి, ఏప్రిల్ నెలల్లో జిల్లాల వారీగా కాన్పుల తీరు