కాషాయ జెండా ఎగరవేసేందుకు... లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ సభలో పాల్గొంటారు. ప్రధాని రాకను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పాలమూరును సెంటిమెంట్‌గా భావిస్తోన్న కమలనాథులు సభకు పెద్దఎత్తున జనాన్ని తరలించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
మోదీ పర్యటన ప్రణాళిక...
మధ్యాహ్నం 1:40 గంటలకు ప్రత్యేక విమానంలో మోదీ శంషాబాద్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 1:45 నిమిషాలకి హెలికాప్టర్లో మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్కు బయలుదేరుతారు. రెండున్నరకు సభాస్థలికి చేరుకుంటారు. సభలో నలభై నిమిషాలు పాల్గొని ప్రసంగించనున్నారు. మూడు గంటల పది నిమిషాలకు సభ ముగించుకొని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సభకు వెళ్తారు.
కాషాయ జెండా ఎగరవేసేందుకు...
మాజీ మంత్రి డీకే అరుణ మహబూబ్‌నగర్ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తుండటం వల్ల ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ, తెరాస పార్లమెంటరీ పక్ష నేత జితేందర్ రెడ్డి భాజపాలో చేరడం పార్టీకి మరింత బలాన్నిచ్చింది. పాలమూరులో కాషాయ జెండా ఎగరవేసేందుకు కమలనాథులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
చేరికలూ ఉండొచ్చు...!
పాలమూరు సభలో ఇతర పార్టీల్లో సీటు దక్కని కొందరు కీలక నేతలు ప్రధాని సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని, లేనిపక్షంలో ఏప్రిల్ 1న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సభలోనైనా చేరుతారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
ఇవీ చూడండి:పార్లమెంటు పోరుకు వెళ్తోన్న నేతలు వీళ్లే...!