Youth on Notifications: ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో చేసిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకటనపై ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నిరుద్యోగ యువత నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 4,429 ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తూనే, ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు గతంలో చేసిందని, ఇప్పుడు కూడా ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారన్న అంశాన్ని స్పష్టం చేయలేదనే వాదన వినిపిస్తున్నారు. కేవలం ఎన్నికల ఎత్తుగడ కాకుండా వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేసి వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఖాళీల భర్తీ ప్రక్రియ సైతం పూర్తి చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారు.
అర్హులైన వారంతా పోటీపడే అవకాశం
ఏ ఉద్యోగాల భర్తీని ఎప్పుడు చేపడతారు, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు.. ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారో క్యాలెండర్ని సైతం ప్రకటిస్తే ఉద్యోగార్థులు అందుకు సిద్ధం కావడానికి సులువుగా ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల్లో కలిపి సుమారు 95వేల మంది ఉపాధి కల్పన కార్యాలయంలో ఉపాధి కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో 30వేల మంది ప్రైవేటు సంస్థల్లో కొలువు చేస్తున్నారు. మిగిలిన వాళ్లు చిన్నచితకా పనులు చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు. వీరిలో అర్హులైన వారంతా పోటీపడే అవకాశం ఉంది. వయోపరిమితిని పదేళ్లు సడలించడంతో ఎక్కువ మంది పోటీపడే అవకాశం ఉంది. ఒక్కో అభ్యర్థి రెండు అంతకంటే ఎక్కువ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తారని అందువల్లే గ్రూప్-1, డీఎస్సీ, ఇతర ఉద్యోగాల పరీక్షల మధ్య సహేతుకమైన గడువు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉచిత శిక్షణ, మెటీరియల్ను అందించాలి..