కాళేశ్వరం తర్వాత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సహా ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి శుక్రవారం పాలమూరు రంగారెడ్డి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మొదట ప్రాజెక్టు ప్రారంభమయ్యే నార్లాపూర్ జలాశయం వద్ద క్యాంపు కార్యాలయంలో... పటాల ద్వారా పనుల పురోగతిని అధికారులు వారికి వివరించారు. అక్కడి నుంచి నార్లాపూర్ వద్ద పంపు హౌజ్, నార్లాపూర్ జలాశయ కట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కన్నుంచి రెండో జలాశయమైన ఏదులకు చేరుకుని పంప్ హౌజ్, సొరంగ మార్గం నిర్మాణ పనులను పరిశీలించారు. ఏదుల వద్దే క్యాంపు కార్యాలయంలో పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమీక్ష.. రాత్రి 8 గంటల వరకు నిరాటంకంగా కొనసాగింది.
వచ్చే ఏడాది వానాకాలం నాటికి సాగునీరు...
పాలమూరు-రంగారెడ్డి పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు.. వచ్చే ఏడాది వానాకాలం నాటికి ఉదండపూర్ జలాశయం వరకూ ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. ఏదుల జలాశయం పనులు 8 మాసాల కిందటే పూర్తయ్యాయని, కేవలం పంపులు మాత్రమే బిగించాల్సి ఉందని, కొవిడ్ కారణంగా ఆలస్యమైందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. నార్లాపూర్ జలాశయం పనులు 80 శాతం, వట్టెం జలాశయం పనులు 90శాతం, కరివెన జలాశయం పనులు 50శాతానికి పైగా, ఉదండాపూర్ పనులు 20 శాతం పూర్తయ్యాయని తెలిపారు.
అధికారులు ,ఏజెన్సీలు కోవిడ్ సమయంలోనూ బాగా పనిచేసి ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకెళ్లినందుకు వారిని అభినందించారు. మిగిలిపోయిన భూసేకరణ, పునరావాసం పనుల పూర్తికి అధికారులను ఆదేశించారు. 2021 జూన్ నాటికి ఒక్క టీఎంసీ సామర్ధ్యంతోనైనా పాలమూరు రంగారెడ్డికి సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళ్తోందని.. నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ చెప్పారు.
ఆన్ లైన్ రిజర్వాయర్ల నిర్మాణంపైనా చర్చ...
సాగునీటి పథకాలు, చెరువులు, కుంటల నింపడం ద్వారా ప్రతి నియోజక వర్గానికి లక్ష ఎకరాలు సాగునీరు అందించడమే లక్ష్యమని మంత్రులు వెల్లడించారు. ఈ మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను సద్వినియోగం దిశగా.. 20 నుంచి 25 టీఎంసీల సామర్థ్యంతో ఆన్ లైన్ రిజర్వాయర్లు నిర్మించాలని యోచిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ఇప్పటికే ఈ అంశం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని.. ఆమోదం లభిస్తే దశల వారీగా ఆన్ లైన్ రిజర్వాయర్ల నిర్మాణం చేపడతామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు వాటిని ఎక్కడ నిర్మించాలి.. భూసేకరణ సహా ఇతర అంశాలపైనా అందరు ప్రజాప్రతినిధులతో చర్చించనట్లు తెలిపారు.
పనుల వెనకబాటుకు కారణాలివే...
భూసేకరణ, కోర్టు కేసులు, సాంకేతిక అంశాలు, కరోనా ప్రభావం, నిధుల లభ్యత ఇతర కారణాల వల్లే పాలమూరు రంగారెడ్డి పనుల్లో కాస్త జాప్యం జరిగినట్లు మంత్రులు చెప్పారు. కోవిడ్ కారణంగా బిగించాల్సిన పంపులు సైతం రాలేదన్నారు. అయితే ఇతర ప్రాజెక్టులతో పోల్చితే పనుల పురోగతి సంతృత్తి కరంగానే ఉందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.