భవిష్యత్తులో రైతువేదికలను బహుళ ప్రయోజనాలకు వినియోగిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వెంకటాపూర్ గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. మాచన్‌పల్లి తండాలో రూ.3 కోట్ల 22 లక్షలతో నిర్మించనున్న 64 రెండు పడక గదుల ఇళ్లకు భూమిపూజ చేశారు. మూసాపేట మండలం వేముల గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. రైతులకు మేలు చేసే సమాచారం, ఆధునిక పద్ధతులు, వ్యవసాయ విధానం, తదితర అంశాలను రైతువేదిక ద్వారా తెలియజేస్తామన్నారు. భవిష్యత్తులో సేద్యం ఎలా ఉండాలో వీటి ద్వారా అవగాహన కల్పిస్తామని, అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు ఉపయోగించుకుంటామని వివరించారు.
రైతులకు పాఠాలు
రైతువేదికలో దృశ్య, శ్రవణ మాధ్యమం ఏర్పాటు చేస్తామని, స్క్రీన్లను ఏర్పాటు చేసి రైతులకు ఆధునిక పద్ధతులు, అధిక దిగుబడి సాధించిన రైతుల విజయగాథలు, ప్రపంచ దేశాలలో వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన మార్పులు, తదితర అంశాలను అందిస్తామన్నారు. సేద్యంలో అన్నదాతలు ఆధునిక పద్ధతులు పాటించాలని, అవసరమైన మోతాదులోనే ఎరువులు వాడాలని, పెట్టుబడి తగినంత మోతాదులో పెట్టాలని, ఏడాదికి రెండు సార్లు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
అన్నదాతలకే పెద్దపీట
కరోనా సమయంలోనూ రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేశామని, అన్నదాతల సంక్షేమం కోసం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతుబీమా కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అన్నదాతలు వాణిజ్యపరంగా ఆలోచించాలని, ముఖ్యంగా రాష్ట్రంలో 80 శాతం కూరగాయలను బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అవసరమైన కూరగాయలను ఇక్కడే పండిస్తే అధిక లాభాలు పొందవచ్చని సూచించారు.