చేతనైతే పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా తేవాలి... మంత్రి సవాల్ కేంద్రం నుంచి రాష్ట్రానికి పైసా నిధులు రాబట్టలేని భాజపా నాయకులు.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం శ్రమించే కేసీఆర్, తెరాస నేతలపై విమర్శలు చేయడం తగదని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. చేతనైతే ఆంధ్రప్రదేశ్‌లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినట్లుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చి నిధులు రాబట్టాలని భాజపా నేతలకు సవాల్ విసిరారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్, నిజలాపూర్‌లో నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలు ప్రారంభించారు. క్రిస్టియన్‌పల్లిలో మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. దేవరకద్ర- వేముల రహదారి, భూత్పూర్-మహబూబ్‌నగర్ రహదారిపై అసంపూర్తిగా ఉన్న వంతెనల నిర్మాణాలు, మహబూబ్‌నగర్ నూతన కలెక్టరేట్, బైపాస్ రోడ్లను మంత్రులు పరిశీలించారు.
కమళదళంపై విరుచుకుపడిన మంత్రి
అన్నసాగర్లో ఏర్పాటు చేసిన సభలో కమలదళంపై విరుచుకుపడ్డారు. పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయించే కేంద్రం.. పంటల కొనుగోళ్లు మాత్రం ఎందుకు చేపట్టదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా జరుగుతున్న లబ్ధి భాజపా నేతలకు కనపించడం లేదా అంటూ ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను ఆపార్టీ నేతలు మింగేశారని.. పైసా ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలతో పేదలను తెరాస సర్కారు రెండు పడక గదులను ఇస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సొంత స్థలం ఉన్న వారికి కూడా రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేసే యోచనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని ప్రశాంత్ రెడ్డి వివరించారు.
అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
రాష్ట్రంలో 26 నూతన కలెక్టరేట్ల నిర్మాణాలను అన్ని రకాల హంగులతో డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఇటీవల కురిసిన వానలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం త్వరలోనే నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్ - వికారాబాద్ రహదారి సమస్యనూ త్వరలోనే తీరుస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికై మంజూరై ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న రహదారులపై హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. గుత్తేదారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చాలాకాలంగా అసంపూర్తిగా మిగిలిన దేవరకద్ర-వేముల రహాదారి, భూత్పూరు నుంచి మహబూబ్‌నగర్ వచ్చే దారిలో వంతెనల నిర్మాణంపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. దేవరకద్ర నియోజకవర్గానికి మరో 1500 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
ప్రథమస్థానంలో నిలుపుతాం..
అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణను కేంద్ర సంస్థలు ప్రశంసిస్తుంటే భాజపా నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, రైల్వే, విద్యుత్ లాంటి రంగాల్ని కేంద్రంలోని భాజపా సర్కారు ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. కేసీఆర్ కరెంట్ ఉచితంగా అందిస్తే.. ఉచితంగా ఇచ్చేందుకు వీల్లేందంటూ కొత్త చట్టాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలి బూట్లు నాకుతున్నారంటూ చౌకబారు విమర్శలు చేస్తున్నారని.. ప్రజల కోసం పనులు చేస్తే బూట్లు నాకుతున్నారనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో మహబూబ్‌నగర్ జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలుపుతామని దీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: గుత్తేదారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవు: ప్రశాంత్‌రెడ్డి