కేంద్రం నుంచి రాష్ట్రానికి పైసా తీసుకురాలేని భాజపా నాయకులు ప్రజల కోసం పని చేసే కేసీఆర్పై విమర్శలు చేయడం ఎందుకని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. చేతనైతే పాలమూరు- రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా తీసుకొచ్చి నిధులు రాబట్టాలని సవాలు విసిరారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో 80 రెండు పడక గదుల ఇళ్లను మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
'పైసా ఇవ్వలేదు'
రాబోయే రోజుల్లో సొంత స్థలం ఉన్న వారికి రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేసే అంశాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని చెప్పారు. దేవరకద్ర నియోజకవర్గానికి 1,500 ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. పంటలకు మద్దతు ధరలు నిర్ణయించే కేంద్రం... ఎందుకు కొనుగోలు చేయదని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి పన్నులు తీసుకుంటున్న కేంద్రం.. తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల్ని కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రైవేటు పరం చేస్తోందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీలకు ఒక్క మంత్రి పదవైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి పథకానికి ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర సంస్థలు తెలంగాణ పథకాలను ప్రశంసిస్తున్నాయని తెలిపారు. తప్పుడు ప్రచారాల్ని ప్రజలు తిప్పి కొట్టాలని సూచించారు.
పేదల సర్కారు
తెరాస అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందని కుటుంబాలు లేవని ఆయన అన్నారు. కేసీఆర్ సర్కారు పేదల సర్కారని చెప్పారు. తెలంగాణ పాలన దేశానికే అదర్శమని కొనియాడారు. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తే దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కలెక్టర్ వెంకట్ రావు, జడ్పీ ఛైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
'పన్నులు తీసుకుంటున్నారు కానీ.. నిధులు ఇవ్వడం లేదు' ఇదీ చదవండి:ధరణి.. భారతదేశానికే ట్రెండ్ సెట్టర్: సీఎం కేసీఆర్