తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రుల సవాల్​: ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామా చేస్తాం - telangana varthalu

భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిస్తే మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని మంత్రులు ప్రశాంత్​ రెడ్డి, శ్రీనివాస్​ గౌడ్​ సవాల్​ విసిరారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో తరహా అభివృద్ధి లేదని వారు ఆరోపించారు. విపక్షాలు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రులు మండిపడ్డారు.

sval
sval

By

Published : Feb 27, 2021, 6:03 PM IST

Updated : Feb 27, 2021, 7:00 PM IST

ప్రభుత్వ రంగంలోగాని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానైనా భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిస్తే మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్... భాజపా నేతలకు సవాల్​ విసిరారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మహబూబ్​నగర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

కేంద్రం వాటా రూ.200 మాత్రమే

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 1,32,899 ఉద్యోగాలు ఇచ్చామని భాజపా పాలిత రాష్ట్రాల్లో అన్ని ఉద్యోగాలిస్తే రాజీనామా చేస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్​ విసిరారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 30,594 ఉద్యోగాలు కల్పిస్తే భాజపా పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్​లో 19వేలు, గుజరాత్​లో 8,900 ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే 2016 రూపాయల పింఛన్లలో కేంద్రం వాటా కేవలం రూ.200 మాత్రమేనని ప్రశాంత్ రెడ్డి అన్నారు. రెండు పడక గదుల ఇళ్లలోనూ కేంద్రం ఇచ్చే నిధులు కేవలం రూ.72వేలు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు.

పింఛన్లు, గృహ నిర్మాణం సహా ఇతర సంక్షేమ పథకాల్లో భాజపా పాలిత రాష్ట్రాలు ఎక్కువ నిధులిస్తే తాము రాజీనామాకు సిద్ధపడతామని సవాల్​ విసిరారు. తెరాస ప్రభుత్వంపై భాజపా నేతలు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారన్న ఆయన.. వాళ్ల నోళ్లు మూయించాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వంలో ఉన్నవారికి అబద్ధాలు చెప్పాల్సిన పని ఉండదు..

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై కమలం నేతలు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ తరహా అభివృద్ధి లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసి తీరతామన్నారు. తెలంగాణ సర్కారిచ్చిన కొలువులు కళ్లముందే కనిపిస్తున్నా, జరుగుతున్న అభివృద్ధి కళ్లముందే కనిపిస్తున్నా విపక్షాలు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్న వారికి అబద్ధాలు చెప్పాల్సిన పని ఉండదన్న ఆయన.. ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేసి తెరాస అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు.

మంత్రుల సవాల్​: ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామా చేస్తాం

ఇదీ చదవండి: నాగార్జునసాగర్‌లో గెలుపుపై నమ్మకం పెరిగింది: బండి సంజయ్

Last Updated : Feb 27, 2021, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details