ప్రజలు కరోనా బారిన పడితే భయాందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కొవిడ్ వార్డులో గతంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆయన తనిఖీ చేశారు. రోగులకు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దగ్గు, జ్వరం, జలుబు లాంటి లక్షణాలు ఉంటే.. పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. 150 పడకల కరోనా వార్డు, ఆక్సిజన్ ప్లాంటు సహా వైద్యం అందుబాటులో ఉందన్నారు. కరోనా వైరస్ని ఎదుర్కొనేందుకు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలతోపాటు ఎస్.వి.ఎస్ ఆస్పత్రిలో ఆర్టీపీసీఆర్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనే 18 వైద్య బృందాలు పనిచేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకునేందుకు వైద్య బృందాలు సహకరిస్తాయని చెప్పారు. కరోనా లక్షణాలున్న వారు బహిరంగ ప్రదేశాల్లో తుమ్మడం, దగ్గడం, లాంటివి చేయకూడదని కోరారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక వార్డును సుందరీకరించాలని, పూల మొక్కలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.