మహబూబ్‌నగర్ జిల్లాలో సాధారణ కొవిడ్ రోగుల కోసం నేటి నుంచి 3 కొవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించి కరోనా వార్డు, ఆక్సిజన్ ప్లాంట్, కొవిడ్ పరీక్షలు నిర్వహించే విభాగాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సౌకర్యాలపై రోగులను పరీక్షించే వైద్యులతో మంత్రి మాట్లాడారు.
కరోనా రెండోదశ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దృష్ట్యా సాధారణ కరోనా రోగులకు ఎక్కడికక్కడే చికిత్స అందించేందుకు గానూ జిల్లాలో దేవరకద్ర, బాలానగర్, కోయిలకొండ మండల కేంద్రాల్లో నేటి నుంచి కొవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో కేంద్రంలో 50 బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఆక్సిజన్, వెంటిలేటర్ తప్ప ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయని వివరించారు. బాధితులకు చికిత్స, పౌష్టికాహారాన్ని అందిస్తామన్నారు. జిల్లా ఆసుపత్రి, ఎస్వీఎస్ ఆసుపత్రులపై భారం తగ్గించే ఉద్దేశంతో మొదటిసారిగా ఈ మూడు మండల కేంద్రాల్లో కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అవసరమైతే మరిన్ని కేంద్రాలనూ ప్రారంభించనున్నట్లు తెలిపారు. అవసరం ఉన్నవారు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. సాధారణ లక్షణాలు ఉన్న వారందరూ హోం ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు.