620 బృందాలతో మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టినట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన మంత్రి.. కొవిడ్ బాధితులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆస్పత్రి ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఆస్పత్రిలో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు నూతనంగా ఎంపికైన 12మంది ఆయుష్ డాక్టర్లు, 31మంది స్టాఫ్ నర్సులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. అనంతరం జిల్లా వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేయాలని వైద్యులకు, సిబ్బందికి సూచనలు చేశారు.
అన్ని సదుపాయాలు అందించాం..
కొవిడ్ బాధితుల కోసం ఇప్పటికే సుమారు 250 పడకలు, అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చామని మంత్రి అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిల్లోనూ సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. కొవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని, పరిస్థితి విషమించిన తర్వాత ఆస్పత్రులకు వస్తే వైద్యులు చేసేది ఏమీ ఉండదని సూచించారు.