సొంత ప్రాణాలతోనే కాదు.. ప్రజల ప్రాణాలతోనూ చెలగాటం ఆడొద్దని.. ప్రతి ఒక్కరు ప్రభుత్వమిచ్చిన మార్గదర్శకాలను పాటించి ఇళ్లకే పరిమితం కావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రెమా రాజేశ్వరి సహా జిల్లా ఉన్నతాధికారులతో కరోనా నియంత్రణపై ఆయన సమీక్ష నిర్వహించారు.
182 మంది..
182 మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చారని వారందరినీ స్వీయ నిర్బంధంలో ఉంచామని మంత్రి చెప్పారు. జిల్లా నుంచి ముంబయి, పూణె సహా ఇతర నగరాలకు వలస వెళ్లిన వాళ్లు.. అక్కడ కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్ల జిల్లాకు వస్తున్నారని చెప్పారు. అలాంటి వారి సమాచారం వెంటనే జిల్లా అధికారులకు ఇవ్వాలని ఆయన కోరారు. అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుని.. గృహ నిర్బంధం లేదా క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందవచ్చని తెలిపారు.