కొత్త ఏడాదిలో మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గతంలో వారానికోసారి తాగునీరు అందేదని ఆయన అన్నారు. జిల్లా రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన సభకు మంత్రి హాజరయ్యారు. పురపాలికలో ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్, హోటళ్లకు తాగు నీటి కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. పాలమూరు ప్రజలు సురక్షితమైన మిషన్ భగీరథ నీళ్లు వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మరో జాతీయ రహదారి :
జిల్లాకు జడ్చర్ల నుండి దేవసూగూరు వరకు మరో జాతీయ రహదారి వస్తోందని... నూతన సంవత్సరంలో ప్రకటన వెలువడుతుందని తెలిపారు. కొత్త రహదారి జిల్లాకు మరో మణిహారం లాంటిదని అభివర్ణించారు.
ఎయిర్పోర్టు రానుంది :
రాయచూర్ -మహబూబ్నగర్ మధ్యలో ఎయిర్ పోర్టు రానుందని మంత్రి తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే రాయచూరుకు గంట, హైదరాబాద్కు గంట 45 నిమిషాల్లో చేరుకోవచ్చని చెప్పారు. మహబూబ్నగర్ మహానగరంగా మారనుందని అశాభావం వ్యక్తం చేశారు. అధికారులు, ఉద్యోగుల సహకారంతో పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందిందని వివరించారు. జనవరిలో వెయ్యి కోట్లతో కొత్త పరిశ్రమ జిల్లాకు రానుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా చుట్టుపక్కల నిర్మిస్తున్న దివిటిపల్లి, ఏనుగొండ, ఎస్వీఎస్, జర్నలిస్ట్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తక్షణమే అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.
నియామక పత్రాలు అందజేత:
ఐదేళ్ల క్రితం పట్టణానికి వారానికోసారి తాగునీరు వచ్చేదని, ఐదేళ్లలో శరవేగంగా అభివృద్ధి చెందడం ఆశ్చర్యమేస్తోందని శాసనమండలి సభ్యుడు దామోదర్ రెడ్డి అన్నారు. మంత్రి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. గ్రూప్ 4 ద్వారా జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులుగా కొత్తగా ఉద్యోగాలు పొందిన 75 మందికి మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు.