రెండు పడక గదుల ఇళ్ల ఎంపికపై తన మాటలను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవో భవనంలో ప్రపంచ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను రెచ్చగొట్టాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియానే వారి ఎజెండాగా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ ప్రజలకు అన్నీ తెలుసునని అన్నారు. తాము కష్టపడి పనిచేస్తుంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని... ఆ వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు.
తప్పుడు ప్రచారం
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో రెండు పడక గదుల ఇళ్లకు 10వేలకు పైగా దరఖాస్తులు అందాయని.. ప్రస్తుతం నిర్మించిన ఇళ్లు 4వేలు మాత్రమే ఉన్నాయని ఆయన వెల్లడించారు. అత్యంత నిరుపేదలకు మాత్రమే రెండు పడకగదుల ఇళ్లను లాటరీ ద్వారా కేటాయిస్తామని అన్నట్లు గుర్తు చేశారు. ఉన్నత స్థాయిలో ఉండి డబ్బున్నవారు సొంతంగా ఇళ్లు కట్టుకోవాలని సూచించానని... ఇది తప్పా..? అని ఆయన ప్రశ్నించారు. తన నియోజకవర్గ పరిస్థితిపై మాత్రమే మాట్లాడితే.. ఈ విషయాన్ని వక్రీకరించి రాష్ట్రవ్యాప్తంగా అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.