రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని యువజన, క్రీడలు, పర్యావరణ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud) అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందులో భాగస్వాములు కావాలని కోరారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. హరితహారం కింద రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో పాల్గొన్నారు.
పాలకొండ దగ్గర నుంచి వెళ్తున్న భారత్‌మాల రహదారిని మరో మార్గం గుండా వెళ్లాలని కొందరు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. తన భూముల కోసమే భారత్‌మాల మార్గాన్ని మళ్లించినట్లు కొందరు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ మార్గం గుండా వెళ్లినా తనకు అభ్యంతరం లేదన్నారు. కావాలంటే తన భూముల్ని రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అభివృద్ధికి సహకరించాలే కానీ తనపై ఆరోపణలు చేయడం తగదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (Dk Aruna)కు హితవు పలికారు.
గతంలో మహబూబ్‌నగర్‌కు మంజూరైన బైపాస్ రహదారిని గద్వాలకు తీసుకెళ్లారని ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా మరొకటి వస్తే.. దానిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డీకే అరుణ భర్త భరత సింహారెడ్డి కాంట్రాక్టు తీసుకొని.. ఆరేళ్లు గడిచినా పూర్తిచేయని వంతెనల నిర్మాణం చేపట్టాలని సూచించారు. రూ.14 లక్షలతో పాలకొండ చెరువును మినీట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.