Prashanth Reddy at BRS Atmiya Sammelanam in Devarakadra : నరేంద్రమోదీ అంతటి అవినీతి, అసమర్థ ప్రధాని ఎవరూ లేరంటూ రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖమంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన.. దేవరకద్రలో 24కోట్ల రూపాయాలతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని క్రీడాశాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం క్యాంపు కార్యాలయం సమీపంలోనే ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు.
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి విలువ పాతాళానికి పతనమైందని.. పెట్రోల్, డీజీల్ సహా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. ఇంతా జరుగుతుంటే మోడీ ప్రధానిగా ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎల్ఐసీ, ఎస్బీఐ వంటి సంస్థల్లో ప్రజలు పెట్టుబడిగా పెట్టిన డబ్బును మోదీ సర్కారు అదాని కంపెనీల్లో పెడుతోందని, దానివల్ల ప్రభుత్వ రంగం సంస్థలు నష్టపోతున్నాయన్నారు.
విమానాశ్రాయాలు, ఓడరేవులు అన్నీ అదానీ, అంబానీలకే కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ సర్కారు వివిధ సంక్షేమ పథకాలతో నిరుపేద కుటుంబాలను ఆదుకుంటుంటే, మోదీ ధరలు పెంచి.. పేద కుటుంబాలపై మోయలేని భారాన్ని పెంచుతున్నారన్నారు. ఎటువంటి ప్రభుత్వం కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. ఈ మధ్య వచ్చిన రెండు, మూడు సర్వేల్లో 60శాతం పైగా బీఆర్ఎస్ వైపు ప్రజల మొగ్గు ఉందని, గెలిచే సీట్లలో దేవరకద్ర మొదటి స్థానంలో ఉందని చెప్పారు.