తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలి' - వట్టెం రిజర్వాయర్‌

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ సామర్థ్యం సరిపోనందున వట్టెం రిజర్వాయర్‌ ద్వారా 1,850 క్యూసెక్కుల నీటిని అదనపు ఆయకట్టుకు అందించాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ మంత్రుల నివాసంలో పలువురు నేతలతో ఆయన సమావేశమయ్యారు.

minister niranjan reddy,Kalwakurthy lift irrigation Scheme
'ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలి'

By

Published : Apr 4, 2021, 11:33 PM IST

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ సామర్థ్యం సరిపోనందున వట్టెం రిజర్వాయర్‌ ద్వారా 1,850 క్యూసెక్కుల నీటిని అదనపు ఆయకట్టుకు అందించాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేఎల్ఐ అదనపు ఆయకట్టుకు పాలమూరు-రంగారెడ్డిలోని వట్టెం రిజర్వాయర్ నుంచి నీరందించాలని వచ్చిన ప్రతిపాదనను.. సీఎం కేసీఆర్ ఇంతకు ముందే ఆమోదించారు.

దీంతో సీఎం ఆదేశాల మేరకు ఆదివారం హైదరాబాద్‌ మంత్రుల నివాసంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్​ రెడ్డి, జైపాల్‌ యాదవ్‌, బీరం హర్షవర్దన్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డిలతో నిరంజన్‌ రెడ్డి సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ సామర్థ్యం లక్షా 80 వేల ఎకరాలుగా ప్రతిపాదించగా.. ఆ కాలువ కింద మూడు లక్షల ఎకరాలకుపైగా పంట సాగు అయ్యింది. ఈ పంట ఎండకుండా నీటిని అందించాలని ప్రజా ప్రతినిధులు మంత్రిని కోరగా ప్రత్యామ్నాయంగా వట్టెం రిజర్వాయర్‌ నుంచి నీరందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

తక్కువ ముంపుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా రిజర్వాయర్లు నిర్మించాలని, గణపసముద్రం చెరువు కట్టతోపాటు డీ8, పసుపుల బ్రాంచ్ కెనాల్, డీ5లను కూడా విస్తరించాలని అధికారులకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఖిల్లా ఘణపురం మండలం షాపూర్ వద్ద వయోడక్ట్ వెంటనే పూర్తి చేసి.. రాబోయే వానా కాలంలో అడ్డాకుల వరకు సాగునీరు అందించేలా చూడాలని అధికారులకు సూచించారు. అదే విధంగా బుద్దారం కాలువపై పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి ఆయకట్టుకు టెండర్లు పిలవాలన్నారు. కేఎల్ఐ పంపులను ఆపిన వెంటనే అవసరమైన మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు. అన్ని చెరువులను కాలువల పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇదీ చూడండి :పత్తి రైతులపై రూ.కోట్ల భారం..పెరగనున్న విత్తన ధరలు

ABOUT THE AUTHOR

...view details