Minister Niranajan Reddy: ఇటీవల వర్షాలకు పంట నష్టపోయిన మిరప రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. నష్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ముందు అన్నదాతలు గోడు వెల్లబోసుకున్నారు. నేలరాలిన మిరప కాయలను దోసిళ్లతో చూపించారు. చేతికొచ్చిన పంట నేలపాలైందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మహిళా రైతులు మంత్రి కాళ్లమీద పడ్డారు. మంత్రి వెంట ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావును సైతం వేడుకున్నారు.
హనుమకొండ జిల్లాలోని పరకాల మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పరకాల మండలం నాగారంలో పంటలను పరిశీలించి వర్షాలతో నష్టపోయిన రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించి పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించాలని భావించారు. చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దవగా.. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి నిరంజన్‌రెడ్డి వరంగల్ జిల్లాకు వెళ్లారు.
ఎవరూ అధైర్య పడొద్దని.. అందరికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నామని వెల్లడించారు.
''కేసీఆర్ ఆదేశాల మేరకు పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. ఎవరూ అధైర్యపడొద్దు. అందరికీ అండగా ఉంటాం. అకాలవర్షాలతో కొన్ని ప్రాంతాలలో పంటలు దెబ్బతిన్న మాట వాస్తవం. నోటికొచ్చిన మిర్చి నేలరాలింది. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మంథనిలో మిర్చి దెబ్బతింది. నష్టపోయిన రైతుల పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరిస్తారు. రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.