మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డికి నిరసన సెగ తగిలిం. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన రైతు వేదిక భవనాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటం పెట్టాలని భాజపా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు.
ఆందోళనకారులు అరెస్ట్
ఇదే సమయంలో వేదికకు ఓ వైపున భాజపా కార్యకర్తలు వచ్చి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని వేదికపై ఉంచాలని డిమాండ్ చేశారు. ఆగ్రహంతో వేదిక వైపు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులు రాకుండా అడ్డుకున్నారు. సుమారు 20 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. అంతకు ముందే ముఖ్యనేతలను ముందస్తుగా అరెస్టు చేసి చిన్న చింతకుంట పోలీస్ స్టేషన్లో ఉంచారు.