మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలిక ఎన్నికలకు నగారా మోగనున్న వేళ.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆ రెండు పట్టణాల్లో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరనున్న కేటీఆర్... తొలత రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా జడ్చర్లకు చేరుకుని... పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జడ్చర్ల మినీ ట్యాంక్ బండ్, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను ప్రారంభిస్తారు. కావేరమ్మపేటలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను పరిశీలిస్తారు. అనంతరం పురపాలికలో 15 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. వ్యవసాయ మార్కెట్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
నేడు జడ్చర్ల, అచ్చంపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన
త్వరలోనే మినీ పురపోరు మొదలవునున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్... ఆయా పట్టణాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. జడ్చర్ల, అచ్చంపేట పురపాలికల్లో నేడు పర్యటించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న కేటీఆర్... బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నారు.
జడ్చర్ల సభ ముగిసిన అనంతరం అచ్చంపేట పట్టణానికి వెళ్లనున్నారు. అక్కడ 5 కోట్లతో నిర్మించ తలపెట్టిన అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం, 8 కోట్లతో సమీకృత మార్కెట్, 75 లక్షలతో మార్కెట్ యార్డు ప్రహరీ గోడ నిర్మాణం, 2 కోట్లతో స్మృతి వనంలో అభివృద్ధి పనులు, 10 కోట్లతో పురపాలికలో అభివృద్ధి పనులు, ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు.
కొవిడ్ నిబంధనలకు లోబడి కార్యక్రమాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ సభకు హాజరయ్యే వాళ్లంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని పార్టీ శ్రేణులు విజ్ఞప్తి చేశాయి.